బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

by Sridhar Babu |
బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి
X

దిశ, కామారెడ్డి : పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ సింధూ శర్మ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఆమె పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేష్ అని కితాబునిచ్చారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని, ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బంది పని తీరు గురించి తెలుసుకున్నారు. డ్యూటీ పరంగా, ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాల రికార్డులను తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రజలకు సైబర్ నేరాల పట్ల, సైబర్ నేరగాళ్లు చూపే మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, సదాశివనగర్ ఎస్సై రంజిత్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed