భిక్షం అడిగినందుకు కాలుతో తన్నిన డీటీ...ఎగిరి టిప్పర్ ను ఢీకొని యాచకుడు మృతి...

by Sridhar Babu |
భిక్షం అడిగినందుకు కాలుతో తన్నిన డీటీ...ఎగిరి టిప్పర్ ను ఢీకొని యాచకుడు మృతి...
X

దిశ, ఆర్మూర్ : దానం చేయమని డిప్యూటీ తహసీల్దార్​ను అడిగినందుకు ఆయన యాచకుడిని కాలుతో తన్నాడు. దాంతో అతను ఎగిరి పక్కన పడటంతో అదే సమయంలో టిప్పర్​ వచ్చి ఢీ కొట్టింది. దాంతో ఆ యాచకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల మామిడిపల్లి చౌరస్తా సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... నిజాంసాగర్ కెనాల్ ప్రాంతంలో నివాసం ఉండే శివరాం అనే యాచకుడు మామిడిపల్లి చౌరస్తా సిగ్నల్ వద్ద కార్ల అద్దాలను తుడుస్తూ యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. కాగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ప్రాంతంలోని మెండోరం

మండల డిప్యూటీ తహసీల్దారుగా విధులు నిర్వహించే రాజశేఖర్ పని ముగించుకుని ఆర్మూర్ కు తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో మామిడిపల్లి చౌరస్తా వద్ద సిగ్నల్​ పడటంతో డీటీ రాజశేఖర్​ కారు కూడా ఆగింది. ఆయన కారు అద్దాలను శివరాం తుడుస్తూ డబ్బులను అడిగాడు. డబ్బులు లేవని రాజశేఖర్ చెప్పడంతో పాటు అంతలోనే ట్రాఫిక్ గ్రీన్ సిగ్నల్ పడడంతో కారును రాజశేఖర్ ముందుకు పోనిచ్చాడు. అయినా శివరాం వెంటబడి డబ్బులు అడుగు తుండడంతో రాజశేఖర్ కోపంతో కారులోంచి దిగి శివరాంను కాలితో గట్టిగా తన్నాడు. దాంతో శివరాం పక్కన ఎగిరిపడ్డాడు. అదే సమయంలో టిప్పర్ వచ్చి శివరాంను ఢీకొని వెనుక టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

అంతలోనే సంఘటనా స్థలానికి ఆర్మూర్ పోలీసులు చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి జరిగిన సంఘటనపై ఆరా తీసి డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. రాజశేఖర్ భీంగల్ డివిజన్లోని టీఎన్జీవోలో కీలక బాధ్యతల్లో ఉండి, మెండోరా మండల డీటీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ యాచకుడిని కాలితో తన్ని అతని మృతికి కారణం కావడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా శివరాం మృతిపై కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చేశారు.

Advertisement

Next Story