అర్హులకు సంక్షేమ ఫలాలు అందించేందుకే ఇంటింటి సర్వే : ఉప ముఖ్యమంత్రి భట్టి

by Aamani |
అర్హులకు సంక్షేమ ఫలాలు అందించేందుకే ఇంటింటి సర్వే : ఉప ముఖ్యమంత్రి భట్టి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వపరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వర్తింపజేయాలనే సంకల్పంతో ఇంటింటి కుటుంబ సర్వే జరిపిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సర్వే విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి సర్వేను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో యావత్తు దేశానికి స్ఫూర్తిగా నిలిచే మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని జిల్లా కలెక్టర్లను, ఎన్యూమరేటర్లకు ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియపై తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రణాళిక శాఖ చీఫ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయాలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష జరిపారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుని శనివారం నుంచి ఇంటింటి సమగ్ర సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సర్వే నేపథ్యంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని, వాటిని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా ఎన్యూమరేటర్లు కలెక్టర్ల దృష్టికి తేవాలని అన్నారు. సర్వేపై ప్రజలతో మమేకం అయితే వారి సందేహాలు ఏమిటి అనేవి తెలుస్తాయని, తక్షణమే వాటిని నివృత్తి చేయడానికి చొరవ చూపాలన్నారు.

ప్రజలు ఎలాంటి అపోహలకు లోనవకుండా ఎన్యూమరేటర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ప్రజల పట్ల ఎన్యూమరేటర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలో భాగస్వాములు అయ్యేలా వారిని ఆహ్వానించాలని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా మంచి కార్యక్రమమని ప్రజల సమగ్ర సమాచారం సేకరణ వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందించేందుకు సర్వే దోహదపడుతుందని తెలిపారు. హౌస్ లిస్టింగ్ దిగ్విజయంగా నిర్వహించారని, అదే ఉత్సాహంతో సర్వే ఆసాంతం పూర్తి అయ్యే వరకు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సర్వే ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళుతున్నారని భాగస్వామ్యం అయిన కలెక్టర్లను, ఎన్యూమరేటర్లు ను, ప్రణాళిక శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. ఇంటింటి కుటుంబ సర్వే మన దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమని, సిబ్బంది నిబద్ధత, అంకితభావంతో పని చేస్తూ సర్వే విజయవంతం చేయాలని అన్నారు. యావత్తు దేశం మన రాష్ట్రం చేపడుతున్న సర్వేను గమనిస్తున్నదని, నిబద్ధతతో సర్వే పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు.

దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. సర్వే సమాచారం గ్రామ స్థాయిలోని చిట్ట చివరి ఇంటికి చేరే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, గ్రామాలు, పట్టణాల ప్రధాన కూడళ్లలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలలోని అధికారులు సర్వే ప్రక్రియ ను పరిశీలిస్తూ సిబ్బందికి తగు, సలహాలు సూచనలు ఇవ్వాలని, ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు.

వీ.సీ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. సర్వే కోసం జారీ చేసిన బుక్ లెట్ లోని అంశాలపై ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుండి ఖచ్చితమైన సమాచారం సేకరణతో వివరాలు నమోదు చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియను సూపర్వైజర్లు, మండల ప్రత్యేక అధికారులు నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే ప్రక్రియను నిబద్ధతతో నిష్పక్షపాతంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అన్నారు. ప్రజలు సర్వే సిబ్బంది కి సహకరించి సమగ్ర సమాచారం ఇవ్వాలని కలెక్టర్ కోరారు. ప్రజల నుండి సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు ఖచ్చిత సమాచారం ఇవ్వాలని అన్నారు. సర్వేపై ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే ఎంపిడిఓ, తహశీల్దార్ల దృష్టికి తేవాలని అన్నారు. సమగ్ర సర్వే నిర్వహించడానికి ఒక రోజు ముందు గ్రామాలు, పట్టణాలలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, సీపీఓ మల్లికార్జున్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed