పేకాట గొడవలే ప్రాణాలు తీసాయా…?

by Naresh |
పేకాట గొడవలే ప్రాణాలు తీసాయా…?
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ఆలస్యంగా వెలుగు చూసిన సజీవదహనం వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ సంఘటన ఓ యువకుడు ఘటన స్థలంలో సజీవ దహనం కాగా మరో యువకుడు తీవ్రంగా కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. నగరంలోని 2వ టౌన్ పరిధిలో గల ఖిల్లా రోడ్డులోని ఓ ప్రైవేట్ స్కూల్ పక్కన పాడుబడిన ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన సంఘటన పోలీసు శాఖకు విచారణలోనూ అంతు చిక్కడం లేదు. నగరంలోని ఖిల్లా ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్, ముఖీద్, మన్సూర్‌లతో పాటు హస్మీ కాలనీకి చెందిన అహ్మద్‌లు పేకాట ఆడేందుకు వెళ్లినట్లు సమాచారం. అక్కడ చీకటి ఉండటంతో కొవ్వొత్తి వెలిగించుకుని మరీ పత్తలాట ఆడినట్టు సమాచారం. అక్కడే మంటలు వేసుకుని పేకాట ఆడుతుండగా నలుగురి మధ్య గొడవ జరిగిందని, గొడవలోనే ముఖీద్ అనే యువకుడు తనను మంటల్లో తోసేసాడని ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్ తెలిపారు.

సజీవదహనమైన యువకుడు ఎవరనేది అంతుచిక్కడం లేదు. పోలీసులు ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేకాట దగ్గర జరిగిన గొడవలో ఒకరిని హత్య చేసి మరొకరిని సజీవ దహనంకు యత్నించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అక్కడ పేలుడు పదార్థాలు అంటుకుని మంటలు చెలారేగాయన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. స్థానికంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఉదయం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి వివరాలు సేకరించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఉదయం వేళ మూడు గంటల ప్రాంతంలో అహ్మద్ ఒంటరిగా కాలిన గాయాలతోనే తన ఇంటికి వెళ్లగా కుటుంబ సభ్యులు అతన్ని జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలాన్ని నిజామాబాద్ డీసీపీ జయరాం, ట్రైనీ ఐపీఎస్ లావణ్య తో పాటు నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, టౌన్ సీఐ నరహరి తదితరులు పరిశీలించారు. పరారీలో ఉన్న ఇద్దరు దొరికితే కానీ కేసు చిక్కుముడి వీడేలా కనిపించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed