ధరణి పోర్టల్ కాదు . . . అది కేసీఆర్ పోర్టల్

by Sridhar Babu |
ధరణి పోర్టల్ కాదు . . . అది కేసీఆర్ పోర్టల్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ కోసం కోట్లాడిన ఉద్యమకారులను, ప్రజలను కేసీఆర్ వంచించాడని, అతని కుటుంబ పాలనతో రాష్ట్రం అవినీతివంతమైందని, ధరణి పోర్టల్ కాదని అది కేసీఆర్ పోర్టల్ అని బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సకల జనుల సంకల్ప సభ జరిగింది. ఈ కార్యక్రమానికి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ లక్ష కోట్లతో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్నారు. దేశంలో కుటుంబ పాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించిందని, అదే తోవలో తెలంగాణలో కేసీఆర్ కుటుంబ కబంద హస్తాల్లో ఉన్న పాలన నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. కేసీఆర్ సర్కారు అవినీతిలో కూరుకపోయిందని, కమీషన్ల కోసమే పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. దళితబంధులో ఎమ్మెల్యేలే 30 శాతం కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో సర్కారు దేశంలో నంబర్ వన్ అని చెప్పుకోవడం సరికాదని,

ద్రవ్యోల్బణంలో తెలంగాణది మొదటి స్థానమన్నారు. బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేయడంతో పాటు రాష్ట్ర రూపురేఖలు మారుస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన పథకాలను అమలు చేయడం లేదన్నారు. మోడీ హయాంలో భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశంగా నిలిచిందన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో పోటీ సమయంలో తాము గెలిస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామన్నారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాష్ట్ర సమితి అని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కొత్త నిర్వచనం చెప్పారు. మోడీ హయాంలో ప్రధానమంత్రి అవాస్ యోజన కింద దేశంలో నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని, ఆ పథకాన్ని కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లుగా పేరు మార్చారని, ఒక్కరికి కూడా ఇళ్లు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే నిరుపేదల సంక్షేమానికి పని చేస్తామని మెనిఫెస్టోలో ప్రతి అంశాన్ని అమలు చేస్తామన్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్ పాల్ సూర్యనారాయణను, నిజామాబాద్ రూరల్ నుంచి దినేష్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story