నిజామాబాద్ బల్ధియాలో మారిన బలా బలాలు

by Sridhar Babu |
నిజామాబాద్ బల్ధియాలో మారిన బలా బలాలు
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బలబలాలు మారిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో ఇతర పార్టీలలో గెలిచిన కార్పొరేటర్లు ఆనాడు అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరారు. కేవలం 13 మంది కార్పొరేటర్లు గెలిచిన బీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లీస్ అండతో కార్పొరేషన్ లో మేయర్ స్థానంలో పాగా వేసిన విషయం తెల్సిందే. ఆనాడు 28 మంది కార్పొరేటర్లు గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మెజార్టీకి ఆరో స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే. అయితే కాంగ్రెస్ తరపున గెలిచిన ఒక్క క్యాండెట్, బీజేపీ తరపున గెలిచిన 9 మంది బీజేపీ కార్పొరేటర్లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, అర్బన్ ఎమ్మెల్యేగా గణేష్ గుప్త ఓడిపోవడంతో బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ లోకి నలుగురు కార్పొరేటర్లు, బీజేపీలోకి నలుగురు కార్పొరేటర్లు చేరారు. దాంతో బీఆర్ఎస్ పార్టీ బల్ధియాలో డీలా పడింది. అదే మాదిరిగా నిజామాబాద్ కార్పొరేషన్ లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణలు ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకోవడంతో ఆ పార్టీ ప్రతిపక్షాలకు బలం చేకూరింది. గురువారం జరిగిన నిజామాబాద్ బల్ధియా సమావేశంలో సంబంధిత ప్రతిపక్షాల బలం పెరగడంతో బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు గొంతును పెంచాయి. తొలిసారి బల్ధియా సమావేశంలోకి మీడియాను అనుమతించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. గడిచిన ప్రభుత్వ హయంలో మీడియాకు నో ఎంట్రీ ఉండేది.

సమావేశాల తర్వాత మేయర్ కేవలం బ్రీఫ్ గా ప్రెస్ నోట్ ను విడుదల చేసే సంస్కృతికి చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. బడ్జెట్ సమావేశంలో మీడియాను అనుమతించాలని బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు పట్టబట్టగా వారికి బీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లీస్ కూడా మద్దతు ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం నగర మేయర్ దండు నీతూ కిరణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి తొలిసారిగా ఎక్స్ అఫిషియో హోదాలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తో పాటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే మీడియాను సమావేశంలోకి అనుమతించాలని కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. వారిని బీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం కూడా మద్దతు పలికింది.

అయితే అవేమీ పట్టించుకోకుండానే సమావేశాన్ని నడిపించేందుకు యత్నించగా ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. అయితే పోలీసుల సహాయంతో మీడియాను బయటకు పంపించి సమావేశాన్ని నిర్వహించారు. బడ్జెట్ సమావేశాన్ని ఉద్దేశించి మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి సుమారు రూ. 274 కోట్ల అంచనా బడ్జెట్ ను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ఈ బడ్జెట్ లో మున్సిపల్ ఆదాయం సుమారు 90 కోట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సుమారు 177 కోట్ల నిధులు గ్రాంట్ల ద్వారా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

మున్సిపల్ ఆదాయం నుండి మౌలిక సదుపాయాల నిర్వహణ చేయనున్నట్టు తెలిపారు. సమావేశానికి ముందు కార్పొరేటర్లు సమస్యలపై చర్చించాలని కోరగా మేయర్ అనుమతించి సభ్యుల ప్రశ్నలకు అధికారులతో వివరణ ఇచ్చారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లను నగర మేయర్ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. నగర అభివృద్ధికి నిధుల సమీకరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story