అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

by Disha Web Desk 15 |
అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
X

దిశ, కామారెడ్డి : అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి, లింగాయపల్లి, రాజంపేట మండలం పొందుర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలతో మాట్లాడారు. రైతులకు సరిపడా టార్పాలిన్లను అందించాలని ఆదేశించారు. కేంద్రాల్లో తాగునీరు, నీడ వసతి కల్పించాలని తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని చెప్పారు. జిల్లాలో 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటివరకు 290 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి 17,810 మంది రైతుల నుంచి 109489 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం విలువ రూ.241.21 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.124.39 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వెల్లడించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు, జిల్లా ఇంచార్జ్ పౌరసరఫరాల మేనేజర్ నిత్యానంద్, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, రైతులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed