జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు

by Dishanational1 |
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు బాంబే హైకోర్టు సోమవారం వైద్య కారణాలపై రెండు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచీకత్తు చెల్లించాలని, ట్రయల్ కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా ముంబై వదిలి వెళ్లకూడదని జస్టిస్ ఎన్‌జే జమాదార్‌తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన నరేష్ గోయల్ అన్ని షరతులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే, ఆయన పాస్‌పోర్టును అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. నరేష్ గోయల్(75) తనతో పాటు తన భార్య అనితా గోయల్ ఇద్దరూ క్యాన్సర్‌తో బాధపడుతున్నందున వైద్య, మానవతా కారణాలతో మధ్యంతర బెయిల్‌ను కోరారు. ఇదివరకు ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు నరేష్ గోయల్ బెయిల్‌ను నిరాకరించింది. అయితే, ఆయనకు నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకోవడానికి అనుమతించింది. జెట్ ఎయిర్‌వేస్‌కు ఇచ్చిన రూ.538.62 కోట్ల రుణాలను, ఇతర నిధులను దారి మళ్లించారని కెనరా బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మీద నరేశ్ గోయల్‌ను 2023, సెప్టెంబర్‪లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఆయన భార్య అనితా గోయల్‌ను గత నవంబర్‌లో అరెస్ట్ చేశారు. కానీ, ఆమె వయస్సు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కోర్టు అనితా గోయల్‌కు బెయిల్ మంజూరు చేసింది.

Next Story

Most Viewed