ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం

by Sridhar Babu |
ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ... ఢిల్లీలో రైతులు తమ న్యాయమైన సమస్యలపైన ఆందోళన చేస్తుండగా మోడీ సర్కార్ జరిపిన కాల్పుల్లో యువరైతు శుభకరన్ సింగ్ అమరత్వం పొందారన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడండి... మోడీని తొలగించండి అనే నినాదంతో చలో ఢిల్లీ కార్యక్రమానికి తరిలిన హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతాంగం ఢిల్లీ కేంద్రానికి వస్తుండగా గురువారం పోలీసులు జరిపిన కాల్పుల్లో యువరైతు శుభ కరన్ సింగ్ మృతి చెందినట్లు తెలిపారు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక, కార్పొరేటు వ్యాపార వర్గాలకు ఊడిగం చేసే విధానాలను చేపట్టడంతో లక్షలాది మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 16 మాసాల రెండు రోజులు ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో 750 మంది అమరత్వం పొందారని, ఆనాడు జరిగే రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దేశ ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పి మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారని పేర్కొన్నారు. ఇందులో ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం, రైతులపై పెట్టిన కేసులు రద్దు చేస్తానని, 750 మంది అమరత్వం పొందిన రైతు కుటుంబాలను కాపాడతానని,

వీటితోపాటు ఏడు డిమాండ్లను రాతపూర్వకంగా అంగీకరించాడన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఫిబ్రవరి 13వ తేదీన మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వగా రాష్ట్రాల సరిహద్దుల్లో రోడ్లపై మేకులు కొట్టి డ్రోన్లతో దాడి చేయించారని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఏ.ప్రకాష్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పరమేష్, అఖిలభారత వ్యవసాయ కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు అంబన్న, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కిషోర్, లక్ష్మినారాయణ, గోపాల్, సత్యం, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు సరి చంద్, జిల్లా కోశాధికారి శ్రీకాంత్, వెంకన్న పాల్గొన్నారు.

Advertisement

Next Story