Collector Rajiv Gandhi Hanumanth : పంద్రాగస్టుకు పకడ్బందీ ఏర్పాట్లు

by Sridhar Babu |
Collector Rajiv Gandhi Hanumanth : పంద్రాగస్టుకు పకడ్బందీ ఏర్పాట్లు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించనున్నందున అందుకనుగుణంగా వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని, 108 అంబులెన్స్ ను వేడుక స్థలి వద్ద అందుబాటులో ఉంచాలన్నారు.

ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్, పశు సంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, పౌర సరఫరాల, పంచాయతీరాజ్ తదితర శాఖల పనితీరును చాటేలా శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలన్నారు. వీటితో పాటు స్టాల్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. గృహ జ్యోతి, మహాలక్ష్మి , రూ. 500 లకు వంట గ్యాస్, రైతు రుణ మాఫీ, రైతు భరోసా, వనమహోత్సవం తదితర పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన వివరాలతో ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఉండాలన్నారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు.

అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేనందున ప్రత్యేక అధికారులు ఉదయం వేళలోనే తమతమ మండలాలు, గ్రామాలలో జెండా విష్కరణ జరిపి, జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే వేడుకలకు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక అధికారులు అందుబాటులో లేని పక్షంలో మండల కేంద్రాలలో ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు జెండావిష్కరణ చేయవచ్చని సూచించారు.

ఎక్కడా కూడా జాతీయ పతాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉత్తమ ఉద్యోగుల ఎంపిక కోసం శాఖల వారీగా నిర్ణీత గడువులోపు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసిన గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులను సైతం ఉత్తమ జీ.పీలు, వార్డులుగా ఎంపిక చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జెడ్పీ సీఈఓ ఉష, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed