కేసీఆర్ ఓటమిపాలైనందుకు వారిని క్షమాపణలు కోరా

by Sridhar Babu |
కేసీఆర్ ఓటమిపాలైనందుకు వారిని క్షమాపణలు కోరా
X

దిశ, భిక్కనూరు : గడిచిన శాసనసభ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఓటమిపాలైనందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లను తాను క్షమాపణలు కోరానని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఆదివారం భిక్కనూరు మండల కేంద్రంలోని ఎస్వీ ఫంక్షన్ హాల్లో జరిగిన భిక్కనూరు, రాజంపేట మండలాల పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గతంలో ఎన్నడూ చేయని విధంగా హాట్ కామెంట్స్ చేశాడు. కామారెడ్డి అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఓటమిపాలైనందుకు తాను ఎంతో బాధపడ్డానని, అందుకే ఇటీవల కామారెడ్డి లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన వారికి క్షమాపణలు కోరానని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సొంత మేనిఫెస్టోతో నాటకాలాడి గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గుర్తు చేస్తున్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలోని మండలాల్లో 150 కోట్లతో విడుదల చేసిన సొంత మ్యానిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక మీపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. కార్యకర్త, నాయకుడు అంటే ఎట్లా ఉంటారో గుర్తుపట్టని మహారాష్ట్రకు చెందిన బీబీ పాటిల్ ను తెచ్చి రెండుసార్లు పార్టీ అధిష్టానం ఎంపీగా గెలిపిస్తే రాజీనామా చేయకుండా బీజేపీలో చేరడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయ విలువలు కాపాడలేని సిగ్గులేని నీవు, బీజేపీ కండువా మెడలో వేసుకొని ఏ మొఖం పెట్టుకొని మళ్లీ నియోజకవర్గంలో ఓట్లు అడిగేందుకు వస్తావో చూస్తామని, ఇక్కడి ప్రజలే నీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు. బర్ల కొట్టంలో పని చేసుకుంటూ బతుకుతున్న గాల్ రెడ్డి ని ఎంపీటీసీ ని చేసి, భిక్కనూరు ఎంపీపీ గా చేస్తే, జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నమ్మకద్రోహం చేసి 30 లక్షలకు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిన దొంగ అని మండిపడ్డారు. మరో నాయకుడు పార్టీతో అన్ని రకాలుగా లబ్ధి పొంది, ఎన్నికల ఖర్చుల వివరాలు ఎక్కడ అడుగుతారో అనే ఉద్దేశంతో ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడని దుయ్యబట్టారు. అటువంటివారు అధికారం లేకుండా పార్టీలో కొనసాగలేరని, ఇటువంటి పూటకో కండువా మార్చే నాయకుల వలన రాజకీయ విలువలు భ్రష్టు పట్టిపోయాయని పేర్కొన్నారు.

ఆర్టీసీ సంస్థ మూతపడడం ఖాయం....

మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ జర్నీ ఇవ్వడం వలన కొద్ది రోజులలో ఆర్టీసీ సంస్థ మూతపడడం ఖాయమన్నారు. ఇప్పటికే నష్టాన్ని భరించలేక కామారెడ్డి డిపో లోని కొన్ని బస్సులు పక్కనపెట్టారని, మునుముందు బస్టాండ్లకు తాళాలు వేసే అవకాశాలు కూడా లేకపోలేవన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్ సంస్థ అని, ఆ కార్పొరేషన్ కు ఫ్రీ జర్నీ ద్వారా జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ సర్కార్ కట్టివ్వాలని, ఇప్పటివరకు ఒక్క పైసా కూడా కట్టివ్వకపోవడం వల్లే ఆర్టీసీ సంస్థ పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన హామీలను నెరవేర్చక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆ పార్టీకి జరగబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతా...

నాయకులకు, కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా భయపడవద్దని, తనకు ఫోన్ చేస్తే చాలు మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతానని ప్రకటించడంతో ఒక్క సారిగా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఊగిపోయి విజిల్స్ చేస్తూ చప్పట్లు కొట్టారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎంపీపీ అధ్యక్షులు పిప్పిరి ఆంజనేయులు, వైసీపీ గుడిసె యాదగిరి, రాజంపేట సొసైటీ చైర్మన్ నల్లవెల్లి అశోక్,రాజంపేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బలవంత రావు, అందె మహేందర్ రెడ్డి, అత్తెలి శ్రీనివాస్, రాపర్తి రాజా గౌడ్, నాగర్తి భూం రెడ్డి, తునికి వేణు, నాగర్తి పోతిరెడ్డి, బోండ్ల రామచంద్రం, గైని శ్రీనివాస్ గౌడ్, జూకంటి మోహన్ రెడ్డి, దాయారి సాయి రెడ్డి, ఆంద్యాల రమేష్, దేవర లక్ష్మి, సుల్తానా, వంగేటి చిన్న నర్సారెడ్డి, అంబల్ల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story