బీఆర్ఎస్ పార్టీని వదిలే వారంతా స్వార్ధపరులే

by Sridhar Babu |
బీఆర్ఎస్ పార్టీని వదిలే వారంతా స్వార్ధపరులే
X

దిశ, బాన్సువాడ : తెలంగాణ ప్రభుత్వం పదేండ్ల పాటు అధికారంలో ఉండగా పదవులు, రాజకీయ అధికారాలను అనుభవించి, మళ్లీ అధికార కాంగ్రెస్ పార్టీలోనికి వెళ్లేవాళ్లంతా స్వార్ధపరులేనని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మోస్రా మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంఘం కళ్యాణ మండపాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏ గ్రామానికి, ఏ వర్గానికి తాను తక్కువ చేయలేదని, అడిగిన వారందరికీ కమ్యునిటీ హాల్స్ మంజూరు చేశానన్నారు. రూ. 150 కోట్లతో నియోజకవర్గంలోని అన్ని కులాలు, వర్గాల వారికి 4,000 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశానన్నారు.

పేదలు తక్కువ ఖర్చుతో ఫంక్షన్లు చేసుకోవడానికి నియోజకవర్గంలో 120 కళ్యాణ మండపాలు నిర్మించానని, ప్రజల కోరిక మేరకు మోస్రా ను నూతన మండలంగా ఏర్పాటు చేశానన్నారు. రూ. 7.50 కోట్లతో మోస్రా మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని డివైడర్, సెంట్రల్ లైటింగ్ తో నాలుగు వరుసలుగా విస్తరించానని, గత పదేళ్లలో నియోజకవర్గంలోని అన్ని రంగాలకు పుష్కలంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశానన్నారు.పదవులు, వస్తాయి పోతాయని, అధికారం వస్తుంది, పోతుందని కానీ చేసిన మంచితనం, పేదలకు చేసిన సేవలు మాత్రమే మిగులుతాయన్నారు.

తన రాజకీయ జీవితంలో ఇరవై ఏళ్లు అధికారంలో ఉన్నా ఎవ్వరికీ అన్యాయం చేయలేదని, కొంతమంది స్వార్ధ నాయకులు ఇతర పార్టీల వైపు పోతున్నారని పేర్కొన్నారు. తనని కడుపున పెట్టుకుని కాపాడుకుంటున్న వారందరినీ తాను కూడా కాపాడతానన్నారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎవరైనా తమ నాయకులు, కార్యకర్తలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోనని హెచ్చరించారు. కార్యక్రమంలోనిజామాబాద్ జెజడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story