సౌదీలో సదాశివనగర్ వాసి మృతి

by Sridhar Babu |
సౌదీలో సదాశివనగర్ వాసి మృతి
X

దిశ, కామారెడ్డి : బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఒకరు అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన సదాశివ నగర్ లో చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ కు చెందిన పోలబోయిన నారాయణ (66) సౌదీ అరేబియా హెయిల్ ప్రాంతంలో పనిచేయడానికి ఆరు సంవత్సరాల క్రితం వెళ్లాడు. అయితే ఎడారిలో పని చేస్తూ 20 రోజుల క్రితం మృతి చెందినట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా జీతం కూడా ఇవ్వకుండా యజమాని హింస పెట్టగా మనస్థాపంతో నారాయణ నిస్సహాయ స్థితిలో గుండెపోటుతో చనిపోయాడన్నారు. 20 రోజుల తర్వాత స్థానిక పోలీసులు తమకు సమాచారం ఇచ్చారన్నారు.

ఈ మేరకు కుటుంబ సభ్యులు ఆర్మూర్ లో గల ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడును కలిసి అక్కడి యజమాని నారాయణ మృతదేహాన్ని పంపించడం లేదని, తమ తండ్రి మృతదేహాన్ని త్వరగా ఇంటికి తెప్పించాలని కుమారులు కోటపాటిని వేడుకున్నారు. వెంటనే స్పందించిన కోటపాటి సౌదీలోని ఇండియా ఎంబసీ అధికారులకు, తెలంగాణ ఎన్ ఆర్ ఐ సెల్ అధికారి చిట్టి బాబుకు సమాచారం పంపి కావాల్సిన నోటరీ చేయించి పంపారు. అదేవిధంగా నారాయణ చేసిన పనికి 2 సంవత్సరాల

జీతంతో పాటు ఆరు సంవత్సరాల కు గాను సంవత్సరానికి ఒక నెల జీతం అదనంగా కలిపి కుటుంబ సభ్యులకు పంపే ఏర్పాట్లు చేయాలని భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖకు వినతి పత్రం పంపించారు. కాగా నారాయణ కొడుకు శ్రీనివాస్ కూడా అదే ప్రాంతంలో రెండు సంవత్సరాలు పనిచేసి ఆరోగ్యం క్షీణించి కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటూ ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉన్నాడని తెలిపారు. ఇలాంటి గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 1000 కోట్లు కేటాయించి బోర్డు ఏర్పాటు చేయాలని కోటపాటి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed