విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి..

by Aamani |
విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కాకతీయ హై స్కూల్ లో నవంబర్ 29న మృతి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి శివ జశ్విత రెడ్డి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని పీడీఎస్ యూ డిమాండ్ చేసింది. ఇలాంటి ఘటనలు ఏ స్కూల్లో పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ పీడీఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో.. సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురైన విద్యార్థిని హాస్పిటల్ లో చూపించడమో, పేరెంట్స్ ను పిలిపించి అప్పజెప్పడమో చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే విద్యార్థి చనిపోయాడన్నారు. పాఠశాల సిబ్బంది ప్రథమ చికిత్స పేరుతో టాబ్లెట్స్ ఇచ్చి వదిలేశారని, యాజమాన్యం నిర్లక్ష్యం తోనే విద్యార్థి చనిపోయాడని ఆరోపించారు. జశ్విత్ రెడ్డి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, పాఠశాల సిబ్బంది, యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారంగా స్కూల్ యాజమాన్యం రూ. 50 లక్షలు ఇప్పించాలన్నారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం, మరణించడం లాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో..జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లలో, విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి,నాణ్యమైన చికిత్స అందించేలా విద్యా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే సిబ్బంది, యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీ డీ ఎస్ యూ నగర ఉపాధ్యక్షులు మహిపాల్, నాయకులు సృజన్, శివకుమార్, రాజేష్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story