ఎటు చూసినా చెరువుల ఆక్రమణలు.. చిన్న వర్షానికే నీట మునుగుతున్న నివాసాలు

by karthikeya |
ఎటు చూసినా చెరువుల ఆక్రమణలు.. చిన్న వర్షానికే నీట మునుగుతున్న నివాసాలు
X

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించాయి. తమ వాస్తవ హద్దుల మేరకు నీటిని నిల్వ చేసుకుని చెరువు శిఖం ఆక్రమిత భూముల్లోకి నీరు చేరింది. జిల్లాలోని కొన్ని పట్టణాలు, గ్రామాల్లో వరద బీభత్సం సృష్టించింది. దీంతో భారీస్థాయిలో నష్టం చేకూరింది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని బేతవోలు పరిధిలోని కొమటికుంట (చిన్నచెరువు) ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిస్థాయిలో నిండింది. ఈ చెరువును బేతవోలు, జెర్రిపోతులగూడెం, సీతారాంతండా వైపు దాదాపు సగం మేర ఆక్రమించారు. దీంతో ఇటీవల వర్షాలకు చెరువులో చేరిన నీరంతా పొలాల్లోకి చేరింది. తమ పొలాలు మునుగుతున్నాయని ఆందోళనకు గురైన కొందరు రైతులు చెరువు గేట్లను తొలగించారు. దీంతో చెరువు నీరంతా వృథాగా బయటకు వెళ్లిపోతోంది. బేతవోలు వీర్లదేవి చెరువు ఎప్పుడు నిండినా సమీపంలోని సుబ్బోరిగూడెం దగ్గరే చెరువుకు గండి పడుతోంది. దీంతో చెరువు నీరంతా బేతవోలు- చిలుకూరు రహదారిపై ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే ఎప్పుడు అక్కడే గండి ఎందుకు పడుతుందో ఎవరికీ అర్థం కాని విషయం. గండి పడుతుందా? లేక పెడుతున్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ కోసం రూపొందించిన 'హైడ్రా' లాగానే జిల్లాల్లో కూడా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే భవిష్యతులో జల విలయాన్ని నియంత్రించగలమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. - దిశ, చిలుకూరు


దిశ, చిలుకూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించాయి. తమ వాస్తవ హద్దుల మేరకు నీటిని నిల్వ చేసుకుని చెరువు శిఖం ఆక్రమిత భూముల్లోకి నీరు చేరింది. జిల్లాలోని కొన్ని పట్టణాలు, గ్రామాల్లో వరద బీభత్సం సృష్టించింది. భారీస్థాయిలో నష్టం చేకూరింది. హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ కోసం రూపొందించిన 'హైడ్రా' లాగానే జిల్లాల్లో కూడా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే భవిష్యతులో జల విలయాన్ని నియంత్రించగలమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని బేతవోలు పరిధిలోని కొమటికుంట (చిన్నచెరువు) ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిస్థాయిలో నిండింది. ఈ చెరువును బేతవోలు, జెర్రిపోతులగూడెం, సీతారాంతండా వైపు దాదాపు సగం మేర ఆక్రమించారు. దీంతో ఇటీవల వర్షాలకు చెరువులో చేరిన నీరంతా పొలాల్లోకి చేరింది. తమ పొలాలు మునుగుతున్నాయని ఆందోళనకు గురైన కొందరు రైతులు చెరువు గేట్లను తొలగించారు. దీంతో చెరువు నీరంతా వృథాగా బయటకు వెళ్లిపోతోంది. ఈ విషయమై పలువురు నీటిపారుదలశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీర్లదేవి చెరువు దాదాపు 200ఎకరాల మేర ఆక్రమణకు గురైంది. పాలెఅన్నారం చెరువు, ఊరచెరువు ఉగ్రరూపం దాల్చి కట్టలు తెంచుకుంది. దీంతో పలువురు నిరాశ్రయులయ్యారు. బేతవోలు వీర్లదేవి చెరువు ఎప్పుడు నిండినా సమీపంలోని సుబ్బోరిగూడెం దగ్గరే చెరువుకు గండి పడుతుంది. దీంతో చెరువు నీరంతా బేతవోలు- చిలుకూరు రహదారిపై ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. మరి ఎప్పుడు అక్కడే గండి ఎందుకు పడుతుందో ఎవరికీ అర్థం కాని విషయం. ఇప్పుడూ అదే జరిగింది. గండి పడుతుందా? పెడుతున్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

చెరువులు కుంటలయ్యాయి..

చెన్నారిగూడెంలో రాములుకుంట, నర్సింహులకుంట చెరువులు ఉన్నాయి. నర్సింహులకుంట వాస్తవ విస్తీర్ణం 54ఎకరాలు. కాగా, ప్రస్తుతం 24ఎకరాలే మిగిలి చెరువు కాస్తా కుంటగా మారింది. కోమటికుంట విస్తీర్ణం 26 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 6ఎకరాల పరిధిలోనే చెరువు మిగిలింది. మిగతా చెరువంతా ఆక్రమణలకు గురైంది. ఈ ఆక్రమణల విషయమై స్థానికులు కొందరు పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఈ చెరువుల ఆధారంగా దళితులు కొందరు ఎస్సీ ఫిషర్ మెన్ సొసైటీ పేరుతో చేపల సాగు చేసేవారు. జిల్లాలో ఎక్కడా కూడా దళితులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన చేపల సొసైటీ లేదు. ఈ గ్రామంలో మాత్రమే ఉండడం గమనార్హం. ఈ రెండు చెరువులూ ఆక్రమణలకు గురి కావడంతో వారికి చేపల సాగు కష్టంగా మారి జీవనోపాధి దెబ్బతిన్నది. ఈ ఆక్రమణల విషయమై పలుమార్లు గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి మొదలుకుని కలెక్టరేట్ వరకు వినతిపత్రాలు అందించినా ఏ ఒక్కరూ మండలంలోని చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోలేదు.

హద్దులు నిర్ణయించకుండా ‘మిషన్ కాకతీయ’

గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ సందర్భంగా మండలంలోని 15 చెరువుల్లో పనులు చేశారు. చెరువు కట్టల మరమ్మతులు, పూడికతీత, అలుగుల నిర్మాణం తదితరాల పేరుతో రూ.లక్షలు వెచ్చించారు. మరి అప్పుడైనా చెరువుల సర్వే నిర్వహించి ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లను గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగించలేదు. నిధులు కరిగాయి. వాటితో పాటు చెరువుల విస్తీర్ణమూ తగ్గిపోయింది. వాటన్నిటి ఫలితమే ప్రస్తుత దుస్థితి. ఇప్పటికైనా జిల్లాల్లో 'హైడ్రా' తరహా సంస్థను ఏర్పాటు చేసి చెరువులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed