కొత్త పీసీసీ ఎదుట అనేక సవాళ్లు.. రేవంత్‌ రెడ్డిలా సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసేనా?

by Gantepaka Srikanth |
కొత్త పీసీసీ ఎదుట అనేక సవాళ్లు.. రేవంత్‌ రెడ్డిలా సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త పీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న మహేష్​కుమార్ గౌడ్‌కు పార్టీలో కొన్ని సవాళ్లు ఎదురు కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్‌లో ఉంది. దీంతో లీడర్లు, కేడర్ మధ్య పటిష్టమైన సమన్వయం అవసరం. ఇందుకు ఆయన క్రియాశీలకంగా కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య మెరుగైన సంబంధాలను నిర్మించాలి. ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నామినేటెడ్ పదవుల్లోని నాయకులను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా పార్టీ చీఫ్, ప్రభుత్వ చీఫ్​(సీఎం) మధ్య ఏకాభిప్రాయం అత్యవసరం. చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా, పార్టీ, ప్రభుత్వంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. పైగా ప్రస్తుతం మంత్రులుగా సీనియర్లు ఉన్నారు.

వాళ్లకూ పార్టీలో ప్రాధాన్యత కేటాయిస్తూనే ఉండాలి. ఇక పార్టీలో స్టేట్ మొదలు మండల స్థాయి వరకు వివిధ కమిటీలు పని చేస్తున్నాయి. ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్‌తో పాటు విద్యార్థి విభాగాలు సైతం ఉన్నాయి. ఆయా కార్యకర్తలు, నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత పీసీసీ అధ్యక్షుడిపై ఉన్నది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా బ్యాలెన్స్ చేశారని పార్టీలో టాక్. ఇప్పుడు సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత మహేష్​కుమార్ గౌడ్ పై ఉన్నదని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే గత పీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవం తనకు కలిసి వస్తుందని కొత్త పీసీసీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ పదవిని మరింత సక్సెస్ ఫుల్‌గా నిర్వహిస్తానని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇది బిగ్ టాస్కే?

పీసీసీ అధ్యక్షుడి హోదాలో మహేష్​కుమార్ గౌడ్‌కు అతి త్వరలో బిగ్ టాస్క్ రానున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నది. స్థానిక సంస్థల్లో మెజార్టీ మెంబర్లు గెలిచేందుకు కొత్త పీసీసీ చొరవ చూపాల్సిన ఆవశ్యకత ఉన్నది. పైగా టిక్కెట్ల కేటాయింపులో అసంతృప్తి లేకుండా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పవర్‌లో ఉండటంతో ఓ వైపు మంత్రులతో పాటు పార్టీలోని ఇతర పెద్దలు తమ అనుచరులను స్థానిక సంస్థల్లో దించేందుకు పార్టీపై ఒత్తిడి తేవడం సహజమే. ఇలాంటి సమయంలో పీసీసీ, ప్రభుత్వంలోని కీలక నాయకులకు మధ్య ఏకాభిప్రాయం అత్యంత ముఖ్యం. ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం జరగకుండా నిత్యం మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక పార్టీ నామినేటెడ్ పదవులు, మంత్రి వర్గ విస్తరణ, పార్టీ కమిటీలు వంటి వాటిలోనూ పీసీసీ అధ్యక్షుడు తన అభిప్రాయాలను స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇతర నేతలు అసంతృప్తికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed