విశ్వాసం సన్నగిల్లుతోంది.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ

by Gantepaka Srikanth |
విశ్వాసం సన్నగిల్లుతోంది.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్ల(Government Hostels)లో నెలకొన్న సమస్యలపై లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో రోజురోజుకూ విద్యా వ్యవస్థ పతనం అవుతోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని గుర్తుచేశారు. బీఆర్ఎస్(BRS) హయాంలో విద్యకు కేసీఆర్(KCR) అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేయకుండా.. బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే రాష్ట్రంలో కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారని అన్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో నిధులు సైతం కేటాయించారని అన్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా వ్యవస్థ పతన అంచులకు చేరుకుందని విమర్శించారు. హాస్టళ్లలో పురుగులు లేని భోజనం లేదు.. పాము కాట్లు, ఎలుక కాట్లు లేని వసతి లేదని ఎద్దేవా చేశారు. కనీస సౌకర్యాల కల్పన కోసం తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తున్నారని చెప్పారు. ఒకవైపు టీచర్లు లేని కారణంగా బడులు మూతబడుతుంటే, మరోవైపు ప్రభుత్వ బడుల మీద విశ్వాసం సన్నగిల్లడంతో డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయని తెలిపారు.

‘మూతపడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించాలి. ఖాళీల్లో విద్యావాలంటీర్లను నియమించాలి. పాఠశాలల్లో పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలి. బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రారంభించాలి. డ్రాపౌట్స్ తగ్గించేలా చూడాలి. మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగుల జీతాలు వెంటనే చెల్లించాలి. వసతి గృహాల అద్దెలు చెల్లించాలి. సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి. విద్యార్థులకు ప్రతి నెల అందాల్సిన రూ.500 పాకెట్ మనీ వెంటనే చెల్లించాలి. యూనిఫార్మ్స్ అందించాలి. సోలార్ పలకల గీజర్లు ఏర్పాటు చేయాలి. బెడ్ షీట్స్, కార్పెట్స్, స్కూల్ బ్యాగ్స్, స్వెటర్స్, మంకీ క్యాప్స్, రగ్గులు, రెండు రకాల బూట్లు వెంటనే అందించాలని కోరుతున్నాం’ అని హరీష్ రావు లేఖలో డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed