కేసీఆర్‌పై అతి భక్తి ప్రదర్శించిన MLA రసమయి.. ఆటాడేసుకుంటున్న నెటిజన్లు!

by Satheesh |   ( Updated:2023-02-10 09:05:08.0  )
కేసీఆర్‌పై అతి భక్తి ప్రదర్శించిన MLA రసమయి.. ఆటాడేసుకుంటున్న నెటిజన్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ప్రతిపక్ష నాయకులు చాలా కాలంగా ఓ విమర్శ చేస్తున్నారు. బీఆర్ఎస్‌లో భజన చేసే వారికే స్థానం ఉంటుందని.. ఉద్యమకారులైనా సరే కేసీఆర్‌ను పొగడకుంటే వారికి కనీసం మర్యాద కూడా లభించదనే ఆరోపణలు ఉన్నాయి. వేదిక ఏదైనా సీఎంను ఆకాశానికి ఎత్తడంలో కొంత మంది బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతుంటారు. తాజాగా అదే బాటలో నడిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కేసీఆర్‌పై అసెంబ్లీ సాక్షిగా రసమయి ప్రదర్శించిన అతి భక్తి.. మరీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పరిస్థితికి అద్దం పడుతోందనే వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. రెసిడెన్షియల్ పాఠశాల అభివృద్ధిపై అసెంబ్లీలో మాట్లాడిన రసమయి బాలకిషన్.. సీఎం కేసీఆర్ సీఎం అయ్యాక గొప్పగా మార్చివేశారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ తెలుగు పాటను వినిపిస్తూ 'చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా? చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా?' అంటూ గతంలో చిటారు కొమ్మ వరకే ఆగిపోయారు.

కానీ కేసీఆర్ సీఎం అయ్యాక రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరెస్ట్ అధిరోహిస్తున్నారని, ఎవరెస్ట్ శిఖరాన్ని తమ కాళ్ల కింద తొక్కెటట్టు మా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశాడని ఆకాశానికెత్తాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే రసమయి బాలకిషన్‌ను నెటిజన్లు కామెంట్లతో టార్గెట్ చేస్తున్నారు. రెసిడెన్షియల్‌లో చదువుకున్న పూర్ణ మాలావత్‌ 2014 మే 25న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తే.. 2014 మే 2న సీఎం అయిన కేసీఆర్ గొప్పతనమేముందని నిలదీస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా రసమయి బాలకిషన్ అబద్దాలు మాట్లాడుతున్నాడని మండిపడుతున్నారు. పూర్ణ మాలావత్ ను ఎవరెస్ట్ అధిరోయించడంలో అప్పటి అప్పటి గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కృషిని చేశారని ఆయన ఘనతను బీఆర్ఎస్, కేసీఆర్ ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత వద్ద మార్కులు కొట్టేయడానికి మరీ ఇంత చెంచాగిరి చేయడమా అని నిలదీస్తున్నారు.

Advertisement

Next Story