ఆపరేషన్‌ చేసే సమయానికి అలిగిన KMC డాక్టర్లు (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-10-10 11:22:36.0  )
ఆపరేషన్‌ చేసే సమయానికి అలిగిన KMC డాక్టర్లు (వీడియో)
X

దిశ, వరంగల్‌ టౌన్‌: ప్రాణాలు పోయాల్సిన వైద్యులు.. పరిహాసంతో ఓ రోగికి చుక్కలు చూపిస్తున్నారు. వరంగల్‌ కేఎంసీ వైద్యులు ఇగోతో రోగికి సేవలదించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు బాధితుడు దామెర అశోక్‌ ఆవేదన చెందాడు. బాధితుడి కథనం ప్రకారం.. అశోక్‌ భార్య జయకు నెల క్రితం కడుపులో నొప్పి రావడంతో కేఎంసీ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేస్తామని అడ్మిట్‌ చేశారు. దాదాపు నెల రోజులుగా వేచి చూస్తున్న వారికి శుక్రవారం ఆపరేషన్‌ చేస్తామని వైద్యులు అశోక్‌తో చెప్పారు. గురువారం సాయంత్రం బ్లడ్‌ రిజర్వ్‌ చేసి ఉంచాలని ఎంజీఎం బ్లడ్‌బ్యాంకుకు సమాచారం ఇచ్చారు. అయితే, గురువారం రాత్రే.. బ్లడ్‌బ్యాంకు నిర్వాహకులు అశోక్‌కు బ్లడ్‌ అందించారు. అది కేఎంసీలోని డాక్టర్లకు చూపించగా, ఇప్పుడు అవసరం లేదంటూ తిప్పిపంపారు. అయితే, బ్లడ్‌ బ్యాంకులో ఆ రక్తం తీసుకోవడానికి నిరాకరించారు. ఈలోగా ఓ సెక్యూరిటీ గార్డు అశోక్‌ భార్య కేస్‌ షీటు తీసుకుని మాయమయ్యాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఏం చేయాలో తోచని అశోక్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. జరిగిన విషయం పోలీసులకు వివరించాడు. స్పందించిన పోలీసులు.. అశోక్‌తో నేరుగా కేఎంసీలోని ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులతో మాట్లాడారు. వివాదం సమసిపోయేలా చర్చించారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయాన్నే ఆపరేషన్‌ చేసేందుకు అశోక్‌ భార్య జయను సిద్ధం చేశారు. అంతే, ఏం జరిగిందో.. ఎలా జరిగిందో గానీ.. కేఎంసీ వైద్యులు అలిగారు. అశోక్‌ పిలిచి, రాత్రి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశావుగా.. వారితోనే ఆపరేషన్‌ చేయించుకోమంటూ వెటకారంగా మాట్లాడి.. ఇప్పటివరకు కూడా రోగిని ఆపరేషన్‌ థియేటర్‌ వద్ద కూర్చోబెట్టినట్టు బాధితుడు అశోక్‌ ఆవేదన వెళ్లగక్కాడు. అశోక్‌ మాట్లాడుతూనే కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఇదీ వరంగల్‌‌లోని కేఎంసీ ఆస్పత్రిలో వైద్యుల తీరు. నిన్నటి సాయంత్రం నుంచి రోగిని ఏం తినకూడదు.. తాగకూడదని చెప్పి... ఇప్పటికి 18 గంటలకు పైగా రోగిని ఇబ్బందులకు గురిచేస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. మరీ.. కేఎంసీ వైద్యుల ఇగోకు కారణమేంటో గానీ, రోగులతో చెలగాటమాడడం సరికాదని ఇతర రోగులు, ఇతరులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed