నమస్తే తెలంగాణలో ఉద్యోగాలు ఊస్ట్.. ఆందోళనలో జిల్లా, డెస్క్ జర్నలిస్టులు!

by GSrikanth |
నమస్తే తెలంగాణలో ఉద్యోగాలు ఊస్ట్.. ఆందోళనలో జిల్లా, డెస్క్ జర్నలిస్టులు!
X

రాష్ట్రం సిద్ధిస్తే తామూ అందులో భాగస్వాములం అయ్యామని సంబురపడ్డారు.. కేసీఆర్ గెలిస్తే తామే గెలిచినంత సంతోషించారు.. అయితే అధికారం చేజారిన నెలలోపటే యాజమాన్యం తీసుకున్న ఊహించని నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అవును.. తెలంగాణ ఉద్యమంలో ‘నమస్తే తెలంగాణ’ వేదికగా తమ వంతు పాత్ర పోషించిన పాత్రికేయుల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా మారింది. ఒక్కొక్కరి ఉద్యోగం ఊడేందుకు రంగం సిద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంతకాలం ‘అధికార పత్రిక’గా పాత్రికేయులు ఓపెన్‌గా చెప్పుకున్న ‘నమస్తే తెలంగాణ’లో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ‘ఇంతకాలం మీరు చేసిన సేవలు చాలు.. ఇక రావద్దు..’ అంటూ స్టాఫ్‌ను పిలిచి యాజమాన్యం ముఖం మీదనే చెప్పేస్తున్నది. దాదాపు 20% మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నది. ఎవరిని తొలగిస్తున్నదీ మరో ఉద్యోగికి తెలవకుండా యాజమాన్యం పకడ్బందీగా వ్యవహరిస్తూ ఒక్కొక్కరిని విడిగా పిలిచి చెప్తుండడంతో ఎవరి ఉద్యోగం ఊడుతున్నదో మరొకరికి తెలియడం లేదు. కానీ బాధను పంచుకునే ఉద్దేశంతో ఒకరికొకరు చెప్పుకోవడంతో విషయం బహిర్గతమైంది. ఆవేదనలో ఉన్న కొద్దిమంది సోషల్ మీడియా వేదికగా మనసులోని భావాలను వ్యక్తం చేసుకున్నారు. ఇది రెండు రోజుల వ్యవధిలో వైరల్‌గా మారిపోయింది. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే ‘నమస్తే తెలంగాణ’లో ఈ క్రైసిస్ మొదలైందని సమాచారం.

కనీసం 200 మంది..

ప్రస్తుతం సంస్థకు ప్రతి నెలా అవుతున్న ఖర్చులో 70% మాత్రమే ఆదాయం వస్తున్నందున నష్టాల్లో పడకుండా ఉండడానికనే సాకుతో కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం యాజమాన్యం తీసుకున్నది. కనీసంగా 200 మంది ఉద్యోగాలు ఊడుతాయనేది అంచనా. మూడేండ్ల నుంచి ఎక్కువ జీతానికి వేరే పేపర్ల నుంచి వచ్చి రెండు మూడు ఇంక్రిమెంట్లు తీసుకున్నవారిని వదిలేసి ఉద్యమకాలంలో వచ్చి దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించే కుట్ర జరుగుతోందని అంటున్నారు.

అల్లం నారాయణ దృష్టికి..

కరోనా సమయంలో మూడేండ్ల కిందట నమస్తే సహా వివిధ మీడియా సంస్థలు కాస్ట్ కటింగ్ పేరుతో సిబ్బందిని తొలగించాయి. వందలాది మంది రోడ్డున పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతో ఇంకొంతమంది జాబ్‌లు పోతున్నాయి. ఈ పరిణామాన్ని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, నమస్తే పూర్వ ఎడిటర్ అల్లం నారాయణ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సడెన్‌గా తొలగించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చొరవ తీసుకోవాలని ఆయనను కోరనున్నారు.

Advertisement

Next Story