- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామపక్షాల దారెటు? బీఆర్ఎస్‌తో సోపతి తెగినట్లేనా..?
దిశ, నల్గొండ బ్యూరో: ఐదు నెలల్లో శాసనసభకు సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేసి అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నం చేయడం సహజం. అందులో భాగంగానే ఈ ఎన్నికల్లో వామపక్షాలు బీఆర్ ఎస్ తో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తాయని అందరూ భావించారు. ఆ మేరకు పార్టీలు కూడా అందుకు సిద్ధంగా ఉన్నట్లు సిగ్నల్ ఇచ్చాయి . కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి అందుకు భిన్నంగా తయారైంది.
మునుగోడు ఉపఎన్నికతో జతకట్టిన పార్టీలు..
గత కొన్ని నెలల క్రితం జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ , సీపీఐ, సీపీఎం పార్టీలు జతకట్టి పని చేశాయి. దేశవ్యాప్తంగా మనువాద పార్టీ అయిన బీజేపీని అణిచి వేయడానికి కాంగ్రెస్ కు తగినంత బలం లేకపోవడం వల్ల , పటిష్టమైన బీఆర్ఎస్ పార్టీతో కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అణిచి వేయడానికి పనిచేస్తున్నామని సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రకటించాయి. మునుగోడు ఉప ఎన్నిక కలయిక తోనే కాకుండా రానున్న ఎన్నికల్లో కూడా కలిసి పని చేస్తామని ఆనాడు ప్రకటించారు. అందులో భాగంగానే కమ్యూనిస్టులు తమ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసినంత నికార్సుగా పనిచేశారు. వారి శ్రమ వల్లే ఉప ఎన్నికల్లో వామపక్షాల బలంతోనే అధికార బీఆర్ఎస్ పార్టీ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా వామపక్షాలతో కలిసి పని చేస్తామని ప్రకటించారు.
-వామపక్షాలకు బలంగా ఉన్న కేంద్రాలు ..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వామపక్షాలైన సీపీఎం, సీపీఐ పార్టీలకు ఒకప్పుడు బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉండేది. కానీ మారుతున్న పరిస్థితులు కారణంగా ఆ పార్టీలు కూడా బలహీనపడ్డాయి. ప్రస్తుతం సీపీఎం పార్టీకి మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, హుజూర్నగర్, మునుగోడు సీపీఐ పార్టీకి దేవరకొండ మునుగోడు హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పటిష్టమైన క్యాడర్ తో పాటు బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ తో పొత్తు కుదిరితే సీపీఎం పార్టీ మిర్యాలగూడ, నల్లగొండ , నకిరేకల్, సీపీఐ పార్టీ మునుగోడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేయాలని భావించింది. కానీ అధికార బీఆర్ఎస్ మాత్రం వామపక్షాలు రెండింటికి ఒక్కొక్క సీటును కేటాయించాలని భావించినట్లు సమాచారం. వాటిలో సీపీఎం కు మిర్యాలగూడ సీపీఐ కి మునుగోడు కేటాయిస్తారని ప్రచారం జరిగింది.
వామపక్షాల దారేటు..?
రానున్న శాసనసభ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని వామపక్షాలు భావించాయి. కానీ గత 20 రోజులుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత సీపీఐ లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ఆ పార్టీ వ్యాఖ్యలు స్పష్టం గా కనిపిస్తున్నాయి . ఇదిలా ఉంటే ఈ మధ్య జిల్లాలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డిలు రానున్న ఎన్నికల్లో మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో ప్రస్తుత ఎమ్మెల్యేలే పోటీ చేస్తారని, వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ తో పొత్తుపై అనుమానాలకు తావిస్తోంది.
స్వతంత్రంగా పోటీ చేసేందుకే అధికార పార్టీ సిద్ధమైనట్లు పరోక్షంగా తెలుస్తుంది . అంతేకాకుండా పార్టీ అధినేత కూడా గతంలో అనేక సార్లు సిట్టింగులకే సీట్లు అనే ప్రకటించారే తప్ప పొత్తులు ఉంటాయని ఎక్కడ కూడా స్పష్టం చేయలేదు. అయితే అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు విన్న తర్వాత పొత్తులకూ అవకాశం లేదని తెలుస్తుంది. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కేవలం ఒకే ఒక్కసారి బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం లు సంయుక్త సమావేశం నిర్వహించాయే తప్ప మరెప్పుడు కూడా వారు కలిసి మాట్లాడుకున్న సందర్భం లేదని సమాచారం. దీంతో రానున్న ఎన్నికల్లో వామపక్షాల దారి ఎటువైపు అనే అనుమానం అందరిలో ఉంది.
ఒంటరిగా పోటీ చేస్తుందా.. పోటీ చేస్తే గెలుపు సంగతి దేవుడెరుగు డిపాజిట్ దక్కుతుందా.. అనే ఆలోచనలో పడ్డారు. గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన మిర్యాలగూడ మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కలేదన్న విషయం అందరికీ తెలిసిందే . ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ చాలాకాలం నుంచి వామపక్షాలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చినప్పటికీ బలహీనమైన కాంగ్రెస్తో కలిసి ప్రసక్తే లేదని నాడు ఆ పార్టీలు నేతలు పేర్కొన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తో స్నేహం తప్ప మరో మార్గం కనిపించడం లేదనేదీ వాస్తవమే. అయినప్పటికీ కమ్యూనిస్టులు ఎటువైపు పయనించనున్నారో తెలియాల్సి ఉంది.