ఉదయ సముద్రం ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తాం.. ఎమ్మెల్యే వేముల వీరేశం...

by Sumithra |
ఉదయ సముద్రం ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తాం.. ఎమ్మెల్యే వేముల వీరేశం...
X

దిశ, నార్కట్ పల్లి : బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా మొదటగా 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం వెల్లడించారు. 50 వేల ఎకరాలకు నీరందాలంటే 250 కోట్ల రూపాయల నిధులు కావాల్సి వస్తుందని తెలిపారు. నార్కట్ పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి బుధవారం హాజరై ఈ విధంగా మాట్లాడారు. రాజకీయ నాయకుడికి జీవితాంతం పదవీ విరమణ ఉండదని ప్రజల్లో ఉంటే ఎప్పుడూ ప్రజాప్రతినిధిగానే ఉంటారన్నారు. అమ్మనబోలు మండల ఏర్పాటుకు తాను ముందుంటానన్నారు. గత ప్రభుత్వంలో గెజిట్ చేశామనేది కేవలం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు.

మూడు నెలలుగా ధర్మారెడ్డి కాల్వ పనులు సాగుతున్నాయని త్వరలోనే నార్కట్ పల్లి చెరువు వరకు చేపట్టి నీటిని అందిస్తామన్నారు. మరో రెండు నెలల్లో 1200 వరకు ఇందిరమ్మ ఇళ్ళను పేదలకు అందిస్తామని వెల్లడించారు. ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మందనలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి, ఎంపీడీవో ఉమేష్, తహశీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు దుబ్బాక పావని శ్రీధర్, పుల్లెంల ముత్తయ్య గౌడ్, పాశం శ్రీనివాస్ రెడ్డి, మేకల రాజిరెడ్డి, చిరుమర్తి యాదయ్య, బొక్క కనకమ్మ భూపాల్ రెడ్డి, ఎస్ ఆర్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు..

వీడ్కోలు సన్మానాలు..

గత ఐదేళ్లుగా పదవిలో కొనసాగిన ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీటీసీల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, అభిమానులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఒకే కుటుంబం లాగా కలిసి ఉండే మండల అభివృద్ధికి కృషి చేసిన విషయాలను నెమరు వేసుకున్నారు. అధికారులు సైతం వారికి అందించిన తోడ్పాటుని గుర్తు చేసుకుంటూ ఇదేవిధంగా అభివృద్ధి విషయంలో జీవితాంతం ముందుకు వెళ్తామని వెల్లడించారు.

Next Story

Most Viewed