పెద్దగుట్టపై కోనేరు పూడ్చివేత.. వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం

by Anjali |
పెద్దగుట్టపై కోనేరు పూడ్చివేత.. వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం
X

దిశ, జడ్చర్ల: పట్టణానికి ఆనుకుని ఉన్న పెద్ద గుట్ట పట్టణానికి తలమానికంగా నిలుస్తున్నది. ప్రకృతి సోయగాలకు,అందాలకు నిలయంగా నిలిచిన జడ్చర్ల పట్టణంలోని పెద్ద గుట్ట చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. శ్రావణమాసం వచ్చిందంటే ఆ గుట్ట భక్తులతో కిటకిటలాడుతుంది. గుట్టపై స్వయంభూగ వెలసిన రంగనాయక స్వామి వారిని పవిత్ర శ్రావణమాసంలో దర్శించుకుని తరించడం ఈ ప్రాంత ప్రజలు తమ ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఆకాశంలోని మేఘాలను ముద్దాడుతున్న రీతిలో గల గుట్టపై రంగనాయక స్వామి స్వయంభుగా వెలిసి ఉండడంతో స్వామివారిని దర్శించుకుని తరించడం ఈ ప్రాంత ప్రజలకు ఓ గొప్ప మధురానుభూతి. అలాంటి ఆలయ సన్నిధిలో ప్రకృతి సహజంగా ఏర్పడిన కోనేరును గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి వేయడం పట్ల పట్టణ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పై కప్పు లేకుండా నిర్మాణం గావించబడిన ఆలయం ముందు ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరులోకి స్వామి వారిపై కురిసిన వరద నీరు చేరుకుంటుంది.

ఆ కోనేరులోని నీటితోనే స్వామివారి విగ్రహాన్ని శుద్ధి చేసి పూజాది కైంకర్యాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.అలాగే భక్తులు కోనేరులో స్నానాదులు ముగించుకొని స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం స్వామి వారు ఆ క్షేత్రంలో వెలసినప్పటినుండి కొనసాగుతోంది. అలాంటి కోనేరును పట్టణ ప్రజలకు, ప్రముఖులకు, శ్రీవారి భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పూడ్చి వేయడం భక్తాదుల మనసులను తీవ్రంగా కలిచి వేసింది. దాంతో వారు ఆలయ పరిరక్షణ కోసం కమిటీగా ఏర్పడి కోనేరు పూడ్చివేతకు పాల్పడిన వారిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం పూడ్చివేత గురించి వెలుగులోకి రావడంతో పట్టణ ప్రముఖులు, భక్తులు, ఆలయ పరిరక్షణ కమిటీగా ఏర్పడి శనివారం ఉదయం 9:30 గంటలకు ఆలయ పరిరక్షణ కోసం ర్యాలీలు రాస్తారోకోలు ధర్నాలు చేయడానికి హైందవ సోదరులు పిలుపునిచ్చారు. పూడ్చివేతకు గురైన కోనేరు పూడికతీతకు, పూడ్చివేతకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.

హైందవ సంఘాలు కూడా ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా యి. హైందవ సోదరులు పిలుపుకు స్పందించిన పట్టణ సిఐ ఆదిరెడ్డి తాను ఈ విషయం గురించి పూడ్చివేతకు బాధ్యుడైన వ్యక్తితో మాట్లాడానని, ఆ వ్యక్తి కోనేరులో పూడికతీతకు అంగీకరించారని, పూడిక తీసి యధావిధిగా కోనేరును ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపానని, ఒకటి రెండు రోజుల్లో కోనేరు యధావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అందువల్ల హైందవ సోదరులు శాంతంగా ఉండాలని సీఐ కోరారు. జిల్లా ఎస్పీ జానకి ధరావత్ తో కూడా ఈ విషయమై మాట్లాడానని, గుట్టపై స్వామివారి సన్నిధిలో గల కోనేరు పూడ్చి వేసి హైందవ సోదరుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని వాట్సాప్ సామాజిక మాధ్యమం వేదికగా సిఐ వెల్లడించారు. ఈ విషయంలో అధికారులు వెంటనే జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని, కోనేరును పూడ్చి తమనోభావాలను దెబ్బతీసిన వారిని ఊరికే వదలకూడదని, కోనేరు పూడ్చివేతకు గుప్తనిధుల త్రవ్వకం కూడా కారణమై ఉండవచ్చునని, కోనేరును పూడ్చిన వారు కోనేరులో గుప్త నిధుల త్రవ్వకాలకు పాల్పడి, ఆ విషయం బయటకు రాకుండా ఉండేందుకోసం పూడ్చివేతకు పాల్పడి ఉంటాడని, ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని పట్టణ ప్రజలు, ప్రముఖులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed