వరదల్లో నష్టపోయిన ప్రతి ఒకరికి పరిహారం అందిస్తాం

by Sridhar Babu |
వరదల్లో నష్టపోయిన ప్రతి  ఒకరికి  పరిహారం అందిస్తాం
X

దిశ, కోదాడ : వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో వరద వల్ల తెగిపోయిన రోడ్డు, బ్రిడ్జి, వరద ప్రభావం చూపిన ప్రతి బజారులో కలెక్టర్ రెండు గంటల పాటు పర్యటించి ప్రతి ఒక్కరి సమస్య విని వారందిరికీ సహాయం చేస్తానని అన్నారు. ముందుగా తెగిపోయిన బ్రిడ్జి ని పరిశీలించి రేపు ఉదయం కల్లా తాత్కాలింగా మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పంచాయతీ రాజ్ ఇంజనీర్ అధికారులను ఆదేశించారు. పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ దెబ్బతిన్న ఇండ్లను, సామాగ్రి కొట్టుకొనిపోయిన వారిని, నీట మునిగిన పంటలు, చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలను లెక్కించుటకు గురువారం ఉదయం 9 గంటల నుండి ఇంటింటి సర్వే చేపడుతున్నట్టు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుండి తెరుకోటానికి అధికారులకు గ్రామ ప్రజలు, యువత సహకారం అందించాలని కోరారు.

వరద ప్రభావంతో కూలిన మిర్యాల బాబు, రామిశెట్టి శ్రీను, నామాల సాయిలు ఇండ్లను, దేవాలయ ఆవరణను పరిశీలించారు. గ్రామంలో పంచాయతీ సిబ్బంది 25 మందితో కలిసి ప్రతి బజార్లో, ప్రతి ఇంటికి బ్లీచింగ్ పౌడర్ వెదజల్లాలని, యాంటీ లార్వా స్ప్రే చేయాలని, వీధులను పరిశుభ్రం చేయాలని, మురికి నీటిలో దోమలు లేకుండా చూడాలని సూచించారు .ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు రేపటి లోపు క్లోరినేషన్ పరీక్ష చేసి ప్రజలకు అందించాలని మిషన్ భగీరథ ఏఈ ని ఆదేశించారు. వైద్య సిబ్బంది టీమ్ లుగా ఏర్పడి ప్రతి ఒక్కరికి పరీక్షలు చేపట్టాలని, అలాగే 15 రోజులలో 3 సార్లు ఫీవర్ సర్వే చేయాలని, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త లు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ ఓని ఆదేశించారు. అలాగే గ్రామంలో పల్లె దావఖానా త్వరగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ తో మాట్లాడాలని ఏఈ ని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఆర్ డీ ఓ సూర్యనారాయణ, డిప్యూటీ డీఎంహెచ్ ఓ నిరంజన్, ఎంపీఓ పాండురంగన్న, కార్యదర్శి అభిలాష్ ఏఎన్​ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed