MLA Vemula Prashanth Reddy : ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది..

by Sumithra |
MLA Vemula Prashanth Reddy : ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది..
X

దిశ, తుంగతుర్తి : కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు పంపించవచ్చని మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తుంగతుర్తి మండలం సూర్యతండ గ్రామ పరిధిలోని గుట్టకింది తండాకు చెందిన పలువురు గిరిజన రైతులు కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను బుధవారం సందర్శించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్ద ఉన్న ప్రశాంత్ రెడ్డిని రైతులు కలిసి తమ బాధను చెప్పుకున్నారు. తమ ప్రాంతానికి కాలువల ద్వారా రావడం లేదంటూ వివరించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎక్కడి మేడిగడ్డ..? ఎక్కడి తుంగతుర్తి..? అంటూ ఆశ్చర్యం ప్రకటించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభిస్తే సుందిళ్ల ద్వారా ఎంఎండి, ఎల్ఎండీ, కాకతీయ కాలువల ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట వరకు నీళ్లు వస్తాయని వివరించారు. ప్రాజెక్టుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతాంగానికి అందించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.

విడుదలైన నీటితో పుష్కలంగా పంటలు పండితే ఆ పేరు కేసీఆర్ కు వస్తుందనే అక్కసుతోనే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందన్నారు. 93 టీఎంసీల కెపాసిటీ కలిగిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితేనే సూర్యాపేట జిల్లా వరకు నీళ్లు విడుదల చేసే అవకాశం ఉంటుందని, కానీ సక్రమంగా నీళ్లు లేకపోవడం వల్ల అది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే కేసీఆర్ కాళేశ్వరం ద్వారా తుంగతుర్తికి, సూర్యాపేట ప్రాంతాలకు గత ఏడాది వరకు కూడా రెండు పంటలకు సరిపోను నీటి విడుదల చేశారని వివరించారు. ప్రస్తుతం జరిగిన చిన్న సంఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సాకుగా తీసుకుంటూ సూర్యాపేట జిల్లాకు నీటి విడుదల చేయడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.90 వేల కోట్లు కాగా అందులో మేడిగడ్డ బ్యారేజ్ వ్యయం రూ.4 వేల కోట్లని, దీనికున్న 83 పిల్లర్లలో కేవలం రెండు మాత్రమే దెబ్బతిన్నాయని వివరించారు. ఈ చిన్నదానికే కాళేశ్వరం కొట్టుకపోయిందంటూ ప్రచారం చేశారని ప్రశాంత్ రెడ్డి రైతులకు వివరించారు.

తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే అవకాశాలు ఉన్న విషయాన్ని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదన్నారు. నీళ్లు లేక పంటలు ఎండుతుంటే ప్రభుత్వం మాత్రం భేషజాలకు పోతోందని అన్నారు. ఇప్పటికైనా రైతుల బాధలు వినాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలకు సూచించారు. నీళ్ల కోసం ఎదురు చూసి విసిగిపోయిన రైతాంగం చివరికి తుంగతుర్తి నుండి ఎస్సారెస్పీ ప్రాజెక్టు వరకు రావడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ముఖ్యంగా ఏవైనా కొట్లాటలు ఉంటే మనం మనం చూసుకుందాం.. కానీ వాటిని రైతుల పై రుద్దవద్దని ప్రభుత్వానికి సూచించారు. లేనిపక్షంలో రైతుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని శపించారు. మంత్రిని కలిసిన వారిలో రైతులు గుగులోతు మోహన్ లాల్, బిక్షం, సూర్య, నెహ్రు, హుస్సేన్, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story