తూ తూ మంత్రంగా మెడికల్ క్యాంపులు

by Naveena |
తూ తూ మంత్రంగా మెడికల్ క్యాంపులు
X

దిశ చింతలపాలెం : చింతలపాలెం మండల కేంద్రంలో గత 15 రోజులుగా డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్న.. డాక్టర్లు మాత్రం తూ తూ మంత్రంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. దీంతో రోగులు వ్యాధి తీవ్రత ఎక్కువ అవటంతో.. ప్రైవేట్ హాస్పిటల్ కి వేల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి గ్రామంలో ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఆరోగ్య శాఖకు సంబంధించిన జిల్లా అధికారుల నుంచి మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న.. కేవలం టాబ్లెట్స్ ఇచ్చి వదిలేస్తున్నారని, 15 రోజుల నుంచి చింతలపాలెం లో రోజురోజుకి డయేరియా కేసులు పెరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు బెడ్స్ ఏర్పాటు చేసి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామపంచాయతీలో అధికారులు ఒక గది ఏర్పాటు చేసినప్పటికీ..ఇప్పటికీ ఆ గదిలో ఎటువంటి బెడ్స్ ఏర్పాటు చేయకుండా రోగులకు కనీసం సెలైన్ పెట్టే పరిస్థితి కూడా లేదన్నారు. ఇంజక్షన్ చేసే వైద్య అధికారులు రాకపోవడంతో.. కేవలం ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ తో నామ మాత్రంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వారం క్రితం చింతలపాలెం గ్రామానికి డిఎంహెచ్ఓ, ఒకసారి డిప్యూటీ డిఎంహెచ్వో రెండుసార్లు సందర్శించిన, డయేరియా కేసులు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గటంలేదు. దీంతో గత్యంతరం లేక రోగులు ప్రైవేట్ హాస్పిటల్ వైపు వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది. చింతలపాలెం మండల కేంద్రానికి కేటాయించిన వైద్య అధికారిని చింతలపాలెం అందుబాటులో ఎందుకు ఉంచట్లేదని స్థానిక ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. అలాగే డయేరియా కేసులు మాత్రం ఒక బజారు నుంచి ఇంకొక బజారుకి వ్యాప్తి చెందుతున్నాయి.ఈ డయేరియాతో చింతలపాలెం గ్రామం గజ గజ వణుకుతుంది. నిన్నటికి నిన్న మైబు అనే వ్యక్తి కోదాడ ప్రైవేట్ హాస్పిటల్లో చేరటం చూస్తుంటే ఈ మెడికల్ క్యాంపులు నడుస్తున్నాయా లేదా ఫోటోలు కోసమే ఉన్నాయా అని అనిపిస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా మెడికల్ క్యాంపు దగ్గర రాకపోవడానికి కారణం తెలుసుకోవాలని, కనీసం బెడ్ ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజు మానిటరింగ్ చేయాలని చింతలపాలెం వైద్యాధికారి చింతలపాలెం లోనే ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story