Etela Rajender : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కరువు

by Sridhar Babu |   ( Updated:2024-09-11 10:45:44.0  )
Etela Rajender : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కరువు
X

దిశ, నల్లగొండ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించేందుకు నల్లగొండకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరుస వర్షాల కారణంగా ప్రజలంతా వైరల్ ఫీవర్​కు గురయ్యారని, ఊర్లకు ఊర్లు దవాఖానాల్లో చేరుతున్నారని అన్నారు. కానీ ప్రజలకు వైద్యాన్ని అందించేందుకు సరైన డాక్టర్లు, సిబ్బంది, మందులు అందుబాటులో లేవని ఆయన అన్నారు. సరైన వైద్యం అందడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ హాస్పిటళ్లన్నీ 24 గంటలు పని చేస్తేనే ప్రజలకు మేలు అవుతుందని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వైద్య వ్యవస్థ నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలున్న హాస్పిటల్లో కూడా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇతర సిబ్బంది పూర్తిస్థాయిలో లేరని అన్నారు.

అప్​గ్రేడ్​ అయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పేపర్ల వరకే పరిమితం అయ్యాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు సంబంధించి యూసీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వలన నిధులు రావడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఉచిత బస్సు మినహా ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చే హామీలు ఎలా అమలు చేస్తారని ఎన్నికలకు ముందే తాము ప్రశ్నించామన్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అహంకారం పెరిగిందని అర్ధమైందన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రజలకు తెలిసిందన్నారు. తాము అధికారంలో ఎన్నాళ్లు ఉంటామో తెలియని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, మాదగోని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరల్లి చంద్రశేఖర్, పోతేపాక సాంబయ్య, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక ముని కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed