నాసిరకం పనులతో రోడ్డు గుంతలమయం... మరమ్మతులు చేసిన ఆర్నెళ్లకే అధ్వానం

by Kalyani |   ( Updated:2024-10-18 10:21:11.0  )
నాసిరకం పనులతో రోడ్డు గుంతలమయం... మరమ్మతులు చేసిన ఆర్నెళ్లకే అధ్వానం
X

దిశ,రామన్నపేట : భువనగిరి - చిట్యాల ప్రధాన రహదారి మరమ్మతులు చేసిన ఆరునెలలకే అధ్వానంగా మారింది. ఈ రహదారి గుండా ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రామన్నపేట మండల ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. ఈ రహదారి గుండా రోజూ వందల కొద్ది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. స్థానిక అంబేద్కర్ విగ్రహం, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ వెళ్లే రోడ్డుతో పాటు పలు చోట్ల రహదారి గుంతల మయంగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఈ మార్గంలో వాహనాలు అతి వేగంగా వస్తుండటంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఈ దారి గుండా భారీ వాహనాలు ప్రయాణిస్తుండటంతో గుంతలు ఏర్పడి మరింత డేంజర్‌గా మారింది. వర్షం వస్తే చాలు గుంతల్లో నీరు చేరుతుంది. దీంతో ఈ దారి గుండా ప్రయాణం పెద్ద సాహసమనే చెప్పాలి. నిత్యం వేలకొద్ది వాహనాల రాకపోకలు సాగే ఈ దారి గుండా పెద్ద గుంతలు ఏర్పడినా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేసి,ప్రమాదాలను నివారించాలని వాహనదారులు,ప్రజలు కోరుతున్నారు.

రోడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదు

రోడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదు. పైన ఇంకో లేయర్ వేయాల్సి ఉంది. రోడ్డు జాయింట్ వేసిన వద్ద ధ్వంసం అవుతున్నది. ధ్వంసం అయిన వద్ద పరిశీలన చేశాం. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. వారం రోజుల్లో మరమ్మతు పనులు పూర్తి చేస్తాం.

సురేందర్,డీఈ‌ఈ, ఆర్ & బీ

Advertisement

Next Story

Most Viewed