ఇథనాల్ ఫ్యాక్టరీ మా కొద్దు

by Sridhar Babu |
ఇథనాల్ ఫ్యాక్టరీ మా కొద్దు
X

దిశ, దిలావర్పూర్ : దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నెలకొల్పనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ మా కొద్దు అని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్​ చేశారు. శుక్రవారం స్థానికంగా ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడుతూ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు.

సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పర్యావరణ వేత్త బాబురావు మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ వలన ఆహార కొరత ఏర్పడుతుందన్నారు. ఇథనాల్ ఉత్పత్తికి బియ్యం, మొక్కజొన్న అవసరం అవుతుందని తెలిపారు. ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి సుమారు రెండు కిలోల బియ్యం అవసరం అవుతుందని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అక్రమ మార్గంలో అనుమతులు పొందారని పేర్కొన్నారు.

అభివృద్ధి కోసం అయితే మీ ఏలూరులో పెట్టుకో : పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య

అభివృద్ధి కోసమే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లయితే మా ప్రాంతంలో అవసరం లేదని, మీ ఏలూరులో నిర్మించుకోవాలని ఫ్యాక్టరీ యజమాని, ఏలూరు ఎంపీకి పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య సూచించారు. తెలంగాణ రాకముందు ఆంధ్ర ప్రాంత నాయకులు ఇక్కడి వనరులను దోచుకున్నారని, ఇప్పుడు కూడా అదే కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి పచ్చని పంట పొలాలకు నిప్పు పెట్టొద్దని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఫ్యాక్టరీని రద్దు చేయాలని కోరారు. కాగా దిలావర్పూర్ మండల కేంద్రంలో స్వచ్ఛందంగా వ్యాపారులు బంద్ పాటించి రైతులకు మద్దతు తెలుపుతూ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీజేఏసీ కో కన్వీనర్ కన్నెగంటి రవి, రాష్ట్ర నాయకులు కొండల్ రెడ్డి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు జేవీ చలపతిరావు, తెలంగాణ విద్యావంతుల వేదిక నేత అంబటి నాగయ్య, న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి, సారంగాపూర్ మాజీ జెడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed