కొనుగోలు చేసిన స్థలం వక్ఫ్ భూమిగా నమోదు.. లబోదిబోమంటున్న రైతులు

by Hamsa |
కొనుగోలు చేసిన స్థలం వక్ఫ్ భూమిగా నమోదు.. లబోదిబోమంటున్న రైతులు
X

దిశ,చౌటుప్పల్: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, ధరణి శాపమో తెలియదు కానీ కొనుగోలు చేసి ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిపై ఇప్పుడు ఆ రైతులు తమ హక్కులను కోల్పోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం అందకుండా పోవడంతో ఆ పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. దేవుడమ్మ నాగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 623 లో సుమారు 11 ఎకరాల భూమి వక్ఫ్ భూమి అయితే 2002 సంవత్సరంలో ఎలా రిజిస్ట్రేషన్ చేశారు?.. మ్యుటేషన్ కు దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారులు రికార్డులలో ఎలా నమోదు చేశారు?.. ఓఆర్సీ పట్టాలను ఎలా అందించారని రైతులు ప్రశ్నిస్తున్నారు. వక్ఫ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం తో భూములు కొనుగోలు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

సర్వే నెంబర్ 623లో..

దేవుడమ్మ నాగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 623లో సుమారు 11 ఎకరాల భూమిని పీవోబీలో చేర్చారు. 623 సర్వేనెంబర్ లో పహాని రికార్డుల ప్రకారం 1965 -70లో దస్తూ దర్గా అని నమోదు అయి ఉంది. అనంతరం 1970-71లో పట్టా భూమిగా, 1976 నుంచి 1991 వరకు దస్తూ దర్గాగా నమోదు చేశారు. అనంతరం 1999 నుంచి 2014 వరకు కూడా పట్టా భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. అంతేకాకుండా ఈ సర్వే నెంబర్ లోని రైతులందరూ కూడా పాత పట్టా పాసు పుస్తకాలు కలిగి ఉన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అన్ని సంక్షేమ పథకాలు కూడా అందుకున్నారు. అంతేకాకుండా రెవెన్యూ శాఖ వీరందరికీ ఓఆర్సీ పట్టాలను కూడా అందించింది. రైతులు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇతరుల నుంచి భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ 2016లో దేవుడమ్మ నాగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 447 నుంచి 704 వరకు సుమారు 557 ఎకరాల భూమిని వక్స్ ల్యాండ్ గా నిర్ధారిస్తూ వక్ఫ్ బోర్డు గెజిట్ ను విడుదల చేసింది. ధరణి అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నూతన పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయడంతో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపమా?

వక్ఫ్ భూమి అయితే ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేస్తే 2002 సంవత్సరంలో ఎలా రిజిస్ట్రేషన్ చేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసిన మ్యుటేషన్ కు దరఖాస్తు చేసుకున్నప్పుడు రెవెన్యూ అధికారులు రికార్డులలో ఎలా నమోదు చేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వక్ఫ్ భూమి అయితే రెవెన్యూ అధికారులు ఓఆర్సీ పట్టాలను ఎలా అందించారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో తాము కొనుగోలు చేసినప్పుడు అధికారులు ఇది నిషేధిత భూమి అని చెప్పి ఉంటే తాము డబ్బులు చెల్లించి కొనుగోలు చేసే వాళ్లం కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ తప్పు జరిగిందని అధికారులు సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారులు చేసిన తప్పిదానికి ఇప్పుడు రైతులు బలి కావాల్సిన పరిస్థితి దాపురించింది.

పంట అమ్ముకునేది ఎలా?

ప్రస్తుతం ఈ భూముల్లో రైతులు వరి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం అమ్మిన తమ నూతన పట్టా పాస్ పుస్తకం తో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ అందించాల్సి ఉంటుంది. కానీ నూతన పట్టా పాస్ పుస్తకం రాకపోవడంతో రైతులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

మా తల్లిదండ్రుల రెక్కల కష్టం వృధా అయ్యింది

- బుషి రెడ్డి మహేందర్ రెడ్డి, పట్టా రైతు కుమారుడు మా నాన్న 2014లో ఆకస్మికంగా మరణించారు. అనంతరం మా అమ్మ పేరుపై భూమిని మార్పిడి చేయమని అడగగా రెవెన్యూ అధికారులు చేయలేదు. 2002 సంవత్సరంలో కాయ కష్టం చేసి మా తల్లిదండ్రులు ఇతరుల వద్ద భూమిని కొనుగోలు చేశారు. అప్పుడే నిషేధిత భూమి అని చెప్పి ఉంటే మా తల్లిదండ్రులకు కష్టం వృథా కాకుండా ఉండేది. మా తల్లిదండ్రులు సంపాదించిన భూమిపై హక్కులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు రుణమాఫీ కూడా చేశారు. కానీ ఇటీవల మా తల్లి కూడా మరణించడంతో రైతు బీమా పథకాన్ని అందుకోలేక పోయాం.

Advertisement

Next Story