- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సుంకిశాల’ చుట్టూ రాజకీయ దుమారం..!
దిశ, నాగార్జునసాగర్ : అధికారుల నిర్లక్ష్యమో.. పాలకుల నిర్లక్ష్యమో తెలియదు గానీ రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సుంకిశాల ప్రాజెక్టు పంప్‌హౌజ్ నీటమునిగిపోయింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద ఒక్కసారిగా సొరంగంలోకి చేరడంతో సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించిన రిటైనింగ్ వాల్ కుప్పకూలిపోయింది. ఈ వ్యవహారం కాస్త రాజకీయ దుమారం రేపుతోంది. ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. సీన్ లోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో మరికాస్త హాట్ టాపిక్‌గా మారింది. సుంకిశాల ప్రాజెక్టును శుక్రవారం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.
ఎవరి వాదన వారిదే..
రిటైనింగ్ వాల్ కూలినపోయిన ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరికి వారు మాది తప్పు కాదంటే.. మాది కాదంటూ వాదనకు దిగారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి స్పందిస్తూ.. ‘సుంకిశాల ప్రాజెక్టును 2021 జులైలో నాటి కేసీఆర్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. టన్నెల్ సైడ్ వాల్‌ని జులై 2023లో పూర్తి చేశారు. సుంకిశాల ప్రాజెక్టు కాంగ్రెస్ కట్టింది కాదు.. మా హయాంలో మొదలు పెట్టింది కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతో పాటు సుంకిశాల కూడా బీఆర్ఎస్ పాపమే.. బీఆర్ఎస్ హయాంలో మొదలు పెట్టిన మిగిలిన నిర్మాణాల పరిస్థితి కూడా భవిష్యత్తులో తేలుతుంది అన్నారు. కాంగ్రెస్ రాగానే కూలిందని గత పాలకులు పత్రిక, టీవీ ఛానల్‌లో సుంకిశాల పాపం వేరొకరిదని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.’ అంటూ మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ స్పందిస్తూ.. మంచి అయితే మాది.. చెడు అయితే బీఆర్ఎస్‌ది అన్నట్టు కాంగ్రెస్ సర్కారు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. నిజానికి ప్రతికూల సమయంలో గేట్లు అమర్చి, సొరంగం ఓపెన్ చేయమన్నది ఎవరు? అనేది తేలితేనే బాధ్యులు ఎవరనేది నిర్ధారించవచ్చు. ఘటనపై బీజేపీ స్పందిస్తూ.. సుంకిశాల ప్రాజెక్టును అందరూ వ్యతిరేకించినా.. బీఆర్ఎస్ పార్టీ కేవలం కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టును ప్రారంభించింది. అయితే అందులో కమీషన్ల వాటా కోసమే ప్రాజెక్టు లోపాన్ని కాంగ్రెస్ దాచి పెట్టిందని బీజేపీ మండిపడింది.
నిర్మాణ లోపాలతోనే కుప్పకూలిందా..?
సుంకిశాల పంప్‌హౌజ్ ప్రాజెక్టును 2021లో రూ.2,200 కోట్లకు మేఘా సంస్థ ఈ పనుల కాంట్రాక్టు దక్కించుకోగా.. ఇప్పటి వరకు రూ.1,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇన్‌టెక్ వెల్‌లో సంపు, పంపు హౌస్, 3 టన్నెళ్లు, పంప్ హౌస్ సూపర్ స్ట్రక్చర్ నిర్మిస్తున్నారు. పంపింగ్ మెయిన్స్‌లో 50 కి.మీ. మేర 3 వరుసల 2,325 ఎంఎం డయా పైపు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రో మెకానికల్ పనుల్లో భాగంగా పంపులు, మోటార్లు, సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్ మిషన్ మెయిన్స్ నిర్మిస్తున్నారు. సుంకిశాల ప్రాజెక్టు ఇన్‌టెక్ వెల్ పనులు ఇప్పటి వరకు 60 శాతం, పంపింగ్ మెయిన్ పనులు 70 శాతం, ఎలక్ట్రో మెకానికల్ పనులు 40 శాతం పూర్తయ్యాయి. అయితే సాగర్ రిజర్వాయర్‌లోకి భారీ వరద చేరుకోవడంతో రిటైనింగ్ వాల్ కూప్పకూలింది. సాగర్ రిజర్వాయర్‌లోకి భారీ స్థాయిలో వరద వస్తుందని ఊహించలేకపోయామని జలమండలి అధికారులు చెప్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నది. శ్రీశైలం నుంచి సాగర్‌లోకి వరద జులై నెలాఖరు నుంచి మొదలైంది. ఆగస్టు 1న సాగర్ నీటిమట్టం 530 అడుగులు మాత్రమే ఉంది. 590 అడుగుల నుంచి 450 అడుగుల వరకు నీటి మట్టాలు పడిపోయినా సొరంగ మార్గం ద్వారా సుంకిశాల పంపుహౌస్‌లోకి నీటిని తరలించే విధంగా డిజైన్ చేశారు. కానీ 530 అడుగుల మేర 169 టీఎంసీల నీటి ధాటినే రిటైనింగ్వాల్ఆపలేకపోవడం నిర్మాణంలోని లోపాలను ఎత్తి చూపుతున్నది. వాస్తవానికి పంపుహౌస్‌లో మోటార్లు బిగించిన తర్వాత సొరంగం పనులు పూర్తిచేస్తారు. కానీ, ఇక్కడ అధికారులు మోటార్లు బిగించకముందే మూడు సొరంగ మార్గాల్లో మూడో మార్గాన్ని ఓపెన్ చేసి పెట్టారు. రిటైనింగ్ వాల్, గేట్ల నిర్మాణం పూర్తికావడం, సొరంగ మార్గాన్ని తెరిచే ఉంచడంతో ఈ ప్రమాదం జరిగింది. సాగర్‌లో 530 అడుగులకు నీరు చేరగానే సొరంగం గుండా పంపుహౌస్‌లోకి నీరు ప్రవేశించే క్రమంలో ఒత్తిడికి గురై, రిటైనింగ్‌వాల్ కూలిపోయింది. వాటర్ లీక్ అవుతున్నట్టు పనిచేస్తున్న సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది.
ఖర్చు నిర్మాణ సంస్థే భరిస్తుందంటున్న అధికారులు..
సాగర్‌కు 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో బ్యాక్ క్లోజ్ వేవ్ యాక్షన్ పెరిగి నీళ్లు టన్నెల్లోకి వచ్చినట్టు వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు. దీంతో టన్నెల్ గేటు ధ్వంసమై, దానికి అనుసంధానంగా ఉన్న సైడ్ వాల్ కూలిపోయినట్టు వెల్లడించారు. నీటి లెవల్ తగ్గిన తర్వాత.. దెబ్బతిన్న సైడ్ వాల్ భాగాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. దీనికయ్యే ఖర్చు నిర్మాణ సంస్థే భరిస్తుందన్నారు. ఈ పనులకు సుమారు రూ.20 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వేశారు.