పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి...

by Sridhar Babu |
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి...
X

దిశ, చండూరు : మున్సిపాలిటీలో పారిశుధ్యం లోపించటంపై స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ తో కలిసి మున్సిపాలిటీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించి అనంతరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సందర్భంగా నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని, చెట్లు మొలిసిన ఖాళీ ప్లాట్లను వెంటనే తొలగించేలా యజమానులకు నోటీసులు అందించాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సెంటర్లో ఉండాలని ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని, విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని తెలిపారు. గ్రామాలలో, మున్సిపాలిటీలలో పాతబడిన డ్రైనేజీలను గుర్తించి వాటిని పునర్ నిర్మించి మురుగునీరు సాఫీగా వెళ్లిపోయేలా చూడాలన్నారు. చండూరు మున్సిపాలిటీలో ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను, అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు.

వసతిగృహాల్లో విద్యుత్ సర్క్యూట్ కాకుండా తగిన చర్యలు తీసుకుంటూనే విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవతో 197 కోట్లు విద్యుత్ శాఖ కు మంజూరయ్యాయని విద్యుత్ అధికారులు తెలపడంతో ప్రాధాన్యత క్రమంలో విద్యుత్ పనులు చేయాలని, చండూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ప్రత్యేకంగా ఒక ట్రాన్స్ఫార్మర్ ని పెట్టాలని అధికారులను ఆదేశించారు. చండూరు రెవెన్యూ డివిజన్ అయిన సందర్భంగా ఆర్డిఓ, ఎమ్మార్వో, ఎంపీడీవో ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రతి ప్రభుత్వ నిర్మాణం భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని అధికారులను కోరారు.

అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ శానిటేషన్ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మరో నెల రోజులపాటు వైద్య అధికారులు గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా కృషిచేయాలన్నారు. విద్యార్థులకు మెరుగైన ఫలితాలు సాధించటానికి చండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఎంఈ ఓ కు సూచించారు. రాబోయే పదిహేను రోజుల తర్వాత అడిషనల్ కలెక్టర్ పర్యటించి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగుపడితే తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టి. పూర్ణచందర్, డీఎంఎచ్ ఓ పుట్టా శ్రీనివాస్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, సీ ఐ వెంకటయ్య, మండలంలోని వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed