కిరాయిలకు ఎన్ఎస్పీ ఇళ్లు.. అలాట్మెంట్ ఒకరి పేరున.. ఉండేది మరొకరు

by Aamani |
కిరాయిలకు  ఎన్ఎస్పీ ఇళ్లు.. అలాట్మెంట్ ఒకరి పేరున.. ఉండేది మరొకరు
X

దిశ, మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేటప్పుడు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేందుకు మిర్యాలగూడ పట్టణంలోని నడిబొడ్డున ప్రభుత్వం 81.30 ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టింది. ఇందులో ఏడు రకాలు(ఏ, బి, సి, ఈ ఈ, ఎస్ ఈ, ఏ ఈ, హాస్టల్) గా 388 ఇంటి నిర్మాణాలు చేపట్టారు. ఇందులో ఏ- 36, బి -105, సి - 210, ఈ ఈ - 4, ఎస్ ఈ - 1, ఏ ఈ- 16, ఈ ఈ - 6, హాస్టల్- 14 నిర్మాణాలను చేపట్టింది. దీంతోపాటు సుమారు 30 ఎకరాల్లో 8- ఎన్ఎస్పీ ఆఫీసులు, ఒక పోస్ట్ ఆఫీస్, ఒక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, పి ఆర్ ఈ ఈ కార్యాలయం, లైబ్రరీ, మున్సిపాలిటీ, స్పోర్ట్స్ స్టేడియం లు ఉన్నాయి. మిగిలిన 50 ఎకరాల్లో ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ నిర్మాణాలు చేపట్టారు. అధికారుల, సిబ్బంది స్థాయిని బట్టి ఇండ్లను అలాట్మెంట్ చేశారు. అందులో కొంతమంది రిటైర్మెంట్ కాగా మరి కొంతమంది ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్నారు.

పేరు ఒకరిది.. ఉండేది మరొకరు..

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని నిర్మించిన ఇండ్లలో అలాట్మెంట్ ఒకరి పేరు మీద ఉంటే అందులో ఉండేది మాత్రం మరొకరు. అలాట్మెంట్ తీసుకున్న అధికారులు వేరొకరికి అధిక రేట్లకు కిరాయిలకి ఇస్తున్నారు. ఉన్న ఇండ్లలో 50% ఇండ్లలో ఇతరులు నివాసం ఉంటున్నట్లు ఆరోపణ వినిపిస్తున్నాయి. గతంలో అనధికారికంగా ఉంటున్నారని కొందరిని అధికారులు ఖాళీ చేయించారు. కానీ అలాట్మెంట్ పేరుతో ఇతరులకు అద్దెకు ఇస్తున్నారు.

ఎక్కువ రేటుకు అద్దె వసూలు..

ఎన్ఎస్పి క్వాటర్స్ లను ప్రభుత్వానికి చెల్లించే అద్దె కంటే ఎక్కువ రేటుకు ఇతరుల వద్ద నుంచి కిరాయి వసూలు చేస్తున్నారు. ఏ టైపు ఇంటికి రూ.628 అద్దె ఉండగా ఐదువేల రూపాయల వరకు కిరాయి కి ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బి టైపులో స్లాబ్ కు 654 రూపాయలు, రేకులకు 389 రూపాయలు ప్రభుత్వానికి అద్దె చెల్లించాల్సి ఉండగా 4000 రూపాయల మేరకు అద్దెకు ఇస్తున్నారు. సీ టైపు 189 రూపాయలు ప్రభుత్వ కిరాయి ఉండగా ఇతరులకు 3,500 చొప్పున కిరాయి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు కొందరు ప్రభుత్వ ఇండ్లను కూలగొట్టి నూతన నిర్మాణాలు చేపట్టారు. వీటిపై ఇప్పటికే పలువురు కోర్టు లో కేసు నమోదు చేసినట్లు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభుత్వ నిర్మించిన ఇల్లు లు ఇతరులకు కిరాయికి ఇచ్చి డబ్బులు దండుకుంటున్న వారిపై చర్యలు తీసుకుని, ఇబ్బందులు పడుతున్న సిబ్బందికి ఇండ్లను అలాట్మెంట్ చేయాలని పలువురు కోరుతున్నారు.

అక్రమాలకు అడ్డగా..

పట్టణంలోని నడిబొడ్డులో శిథిలావస్థలో ఉన్న ఎన్ఎస్పీ ఇండ్లు అక్రమాలకు అడ్డగా మారుతున్నాయి. కొందరు యువకులు శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలను వాడడానికి ఉపయోగిస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. దీంతోపాటు కిరాయి ఇండ్లు కూడా అనధికారిక పనులకు ఉపయోగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఎన్ఎస్పీ ఇండ్లను పనిచేసే వారి కేటాయించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story