బల్దియా ‘పరిపాలన’ అస్తవ్యస్తం..

by Aamani |
బల్దియా ‘పరిపాలన’ అస్తవ్యస్తం..
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. అసలు జీహెచ్ఎంసీలో మంజూరైన పోస్టులెన్నీ..ఎంత మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు, ఎంత మంది అధికారులు డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు, ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి? అనే సమాచారం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పలువురు యూనియన్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏ విభాగానికి సంబంధించిన సమాచారం సంబంధిత విభాగాధిపతి వద్ద లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం.

అటకెక్కిన ప్రసాదరావు కమిటీ సిపార్సలు..

జీహెచ్ఎంసీలో స్టాపింగ్ ప్యాట్రన్ పై 2011లో ప్రసాదరావు కమిటీ సిఫార్సులు చేసింది. అప్పటి లెక్కల ప్రకారం ఐదు జోన్లు, 18 సర్కిళ్లు, 150 వార్డులకు గాను 2050 మంది ఉద్యోగులు ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న ఆరు జోన్లు, 30 సర్కిళ్ల, 150 వార్డలు ప్రకారం అయితే ఈ సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ కమిటీకి సంబంధించిన సిఫార్సులు అధికారులు అటకెక్కించారు.

8 నెలల్లో 183 మంది రిటైర్డ్..

జీహెచ్ఎంసీ గత 8 నెలల్లో అటెండర్ నుంచి మొదలుకుని అదనపు కమిషనర్ వరకు 183 మంది పదవీ విరమణ పొందారు. కానీ కొత్తగా పోస్టుల భర్తీ మాత్రం కరువైంది. దీంతో పాటు ప్రతి రెండేండ్లకొకసారి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ ఆ ఉత్తర్వులను అధికారులు పక్కన పెట్టేశారు. యూనియన్ నాయకుల ఒత్తిడి మేరకు 55 సూపరింటెండెంట్, 85 సీనియర్ అసిస్టెంట్, 240 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ప్రమోషన్ల జాబితాను విజిలెన్స్ విచారణ కోసం పంపించారు. వీటిలో శాఖపరమైన రిమార్కులు ఉన్నవారి కోసం విచారిస్తున్నారు. అలాంటి పేర్లను ప్రమోషన్ లిస్టులోంచి తొలగించనున్నారు.

అధికారులపై పనిభారం..

జీహెచ్ఎంసీలో ఆదాయం వచ్చే రెవెన్యూ (ఆస్తి పన్నుల, ట్రేడ్ లైసెన్స్), టౌన్ ప్లానింగ్ విభాగాల్లో సరిపోను అధికారులు, ఉద్యోగులు లేకపోవడంతో ఉన్నవారికి పని భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్తి పన్ను విభాగంలో ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు 340 మంది ఉన్నారు. వీరిలో 100 మంది రెండు పనులు చేయాల్సి వస్తుంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పర్యవేక్షణ కరువైందని అధికారులు చెబుతున్నారు. ఇంజినీరింగ్, శానిటేషన్, హెల్త్, ఇతర విభాగాల్లో సిబ్బంది కొరత ఉందని చెబుతున్నారు. సిబ్బంది కొరత తీర్చడానికి సర్కార్ చర్యలు తీసుకోవాలంటే జీహెచ్ఎంసీ నుంచి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ అందుకు సంబంధించిన సమాచారమే కరువైందనే విమర్శలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీలో ఎన్ని విభాగాలున్నాయి? ఎంత మంది అదనపు కమిషనర్లు, హెచ్ఓడీలు, జాయింట్ కమిషనర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు ఉన్నారనే సమాచారం లేదని పరిపాలన విభాగం అధికారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో జీహెచ్ఎంసీలో రెగ్యులర్ ఉద్యోగులుండేది కష్టమేనని, అంతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉంటారేమో అని ఓ సీనియర్ అధికారి ఆందోళన వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed