సీఎంఆర్ఎఫ్ స్కాంలో మిర్యాలగూడ ఆస్పత్రులు.. ప్రభుత్వానికే టోకర

by Anjali |
సీఎంఆర్ఎఫ్ స్కాంలో మిర్యాలగూడ ఆస్పత్రులు.. ప్రభుత్వానికే టోకర
X

దిశ, మిర్యాలగూడ టౌన్: ప్రజల వైద్య ఖర్చులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం నుంచి అందించే సీఎంఆర్ ఎఫ్ సాయంపై కన్నేసిన కొందరు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు నకిలీ బిల్లులతో సీఎం సహాయ నిధిని కాజేశారు. వైద్యం చేసి బాధితులకు బిల్లులు ఇవ్వాల్సిన ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం దందాలకు తెరతీశారు. నకిలీ బిల్లులతో ప్రభుత్వాన్ని మోసం చేసి లక్షల రూపాయాలు కాజేసి ప్రైవేట్ ఆస్పత్రులపై సీఐడీ కేసు నమోదు చేసింది. రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ కు పాల్పడిన 30 ఆస్పత్రులలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మూడు ఆస్పత్రులు ఉన్నాయి.

పట్టణంలో ఉన్న మహేష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నవీన్ స్పెషాలిటీ హాస్పిటల్, నల్గొండలోని అమ్మ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లపై కేసు నమోదు చేశారు. అయితే గత ఏడాది సీఎంఆర్ ఎఫ్ బిల్లుల స్కామ్ జరగడంతో అధికారులు సంబంధిత ఆస్పత్రులలో తనిఖీలు చేశారు. తనిఖీల సందర్భంలో వైద్యులను, సిబ్బంది, నిర్వహకులను విచారించారు. విచారణ చేపట్టిన అధికారులు మహేష్ సూపర్ స్పెషాలిటీ హస్పటల్ లో సుమారు ముగ్గురు నకిలీ రోగుల పేరుతో రూ. 4.50 లక్షల స్వాహా చేసినట్లు గుర్తించారు. అయితే ఈ హాస్పిటల్ లో ఇప్పటికే నాలుగు రకాల హాస్పిటల్ పేర్లతో మార్పులు చేసి ఓకే యాజమాన్యం నిర్వహణ సాగించినట్లు తెలుస్తోంది.

నిర్వహకులే సూత్రధారులు ?

హాస్పిటల్‌లను నడిపిస్తున్న నిర్వహకులు వైద్యులు ,సిబ్బందితో కలిసి నకిలీ బిల్లుల స్వాహా చేయడంలో నిర్వహకులే సూత్రధారులుగా తెలుస్తోంది. గ్రామాల నుంచి రోగులను తీసుకొచ్చే ఆర్ఎంపీలను సాయంతో రోగుల పేర్లతో నకిలీ బిల్లులు తయారుచేసి సీఎం నిధిని కాజేస్తున్నట్లు సమాచారం. అయితే బిల్లులు మంజూరైన తర్వాత బాధితులకు 15 శాతం ఇచ్చి మిగతా డబ్బును తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వం నుంచి అందే సాయాన్ని నకిలీ రోగుల పేర్లతో బిల్లులు స్వాహా చేస్తున్నారు. అయినప్పటికీ విచారణ చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. దీనివలన వివిధ రకాల పేర్లతో హాస్పిటల్ ను కొనసాగిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

హాస్పిటల్ మారుతున్న వైద్యులు..

పేరుకు పెద్ద పెద్ద (సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ )పేర్లతో నిర్వహణ సాగిస్తున్న వైద్యులు పలు ఆరోపణాలు, అక్రమాలు చోటు చేసుకొగానే మరో పేరుతో హాస్పిటల్ కొనసాగిస్తున్నారు. మహేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నకిలీ బిల్లుల వ్యవహరం వెలుగులోకి రావడంతో మరో చోటకు వెళ్లిపోయి అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యులతో పాటు నిర్వహకులు కూడా పేర్లు మార్చి హాస్పిటల్ సాగిస్తున్నారు. ఇలా స్కామ్‌లకు పాల్పడుతున్న వైద్యులు, నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed