BREAKING: నల్లగొండ జిల్లాలో తీవ్ర విషాదం.. అస్సాంలో అనారోగ్యంతో జవాన్ మృతి

by Shiva |   ( Updated:2024-07-26 05:45:01.0  )
BREAKING: నల్లగొండ జిల్లాలో తీవ్ర విషాదం.. అస్సాంలో అనారోగ్యంతో జవాన్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్/హాలియా: దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఆర్మీలో చేరి ఓ జవాన్ అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన ఘటన అస్సాం రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని మదారి‌గూడెం గ్రామానికి చెందిన ఈరేటి యాదయ్య పార్వతమ్మ మూడో సంతానమే ఈరేటి మహేష్ (24). అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా 2022లో సూర్యాపేటలో జరిగిన సెలక్షన్లలో మహేష్ ఎంపికయ్యారు. కాగా, గత రెండేళ్లుగా అస్సాంలోని దబీర్‌ఘట్ ప్రాంతంలో సైనిక భద్రత దళాల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా ఈనెల 9న మహేష్‌కు తీవ్రమైన జ్వరంతో ఛాతిలో నొప్పి వచ్చి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో అధికారులు స్థానికంగా ఉన్న సైనిక ఆసుపత్రికి తరలించగా అక్కడ వారం రోజుల పాటు చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మహేష్ ఛాతిలో నొప్పి అధికంగా ఉందని చెప్పడంతో వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం రాత్రి మహేస్ చికిత్స పొందుతూ మృతి చెందారు. మహేష్ మృతదేహాన్ని సైనిక లాంఛనాల ప్రకారం ప్రత్యేక హెలికాప్టర్ ఇవాళ సికింద్రాబాద్‌కు తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది.

కుటుంబంలో ఇద్దరూ సైనికులే..

విధి నిర్వహణలో మృతి చెందిన ఈరేటి మహేష్ తండ్రి యాదయ్యకు ముగ్గురు సంతానం కాగా రెండో కుమారుడు ఈరేటి నరేష్ గత 2019 సంవత్సరంలో మిలటరీలో చేరాడు. నరేష్ జమ్ము కాశ్మీర్‌లోని మహర్‌లో భద్రత దళాల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అన్న సైనికుడు కావడంతో తాను కూడా దేశానికి సేవ చేస్తానని మహేష్ 2022 సంవత్సరంలో అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఉద్యోగం సాధించాడు.

మదారిగూడెంలో విషాద ఛాయలు

గ్రామానికి చెందిన ఈరేటి మహేష్ ఆర్మీలో పనిచేస్తూ మృతి చెందడం పట్ల గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున మహేష్ ఇంటి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు. దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బాధ్యతలు నిర్వహించిన మహేష్ తమ గ్రామానికి ఎంతో గర్వ కారణమని గ్రామస్థులు పేర్కొన్నారు. కుమారుడి అకాల మృతితో మహేష్ తల్లి పార్వతమ్మ గుండెలు అవిసేలా రోదిస్తుండటం అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది.

Advertisement

Next Story