సంతలో ప్రైవేట్ వ్యక్తులు వసూల్ దందా..

by Anjali |   ( Updated:2023-06-08 05:47:15.0  )
సంతలో ప్రైవేట్ వ్యక్తులు వసూల్ దందా..
X

దిశ,నల్లగొండ బ్యూరో: మిర్యాలగూడ పట్టణ సమీపంలోని అవంతిపురం సంతలో ప్రైవేట్ వ్యక్తుల వసూలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని అతిపెద్ద సంతగా గుర్తింపు పొందిన మిర్యాలగూడ సంతలో అధికారులు కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసుకొని పశువుల సంతలో వసూళ్లకు పాల్పడుతున్నారు. సంత జరిగే రెండు రోజుల్లో వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం అధికారులు కుమ్మక్కై వసూలు అయిన డబ్బులను పంచుకోవడం తో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. గత సంవత్సరంనర కాలంగా మార్కెట్ కమిటీకి చైర్మన్ లేకపోవడం వలన ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు పశువుల సంతలో కూడా అక్రమాలకు తావిస్తుంది.

ప్రైవేట్ వ్యక్తులు వసూలు

మిర్యాలగూడ సమీపంలో ఉన్న అవంతిపురంలో వారానికి రెండు రోజులు (మంగళవారం, శనివారం) పశువుల సంత జరుగుతుంది. ఈ సంతకు మిర్యాలగూడ పరిధి పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి, చెన్నై గుడివాడ, గుంటూరు, హైదరాబాద్ పట్టణాల నుంచి కూడా పశువులను, మేకలను, గొర్రె పొట్టేలను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి పెద్ద సంఖ్యలో దళారులు, వ్యాపారస్తులు వస్తుంటారు. కొనుగోలు చేసిన ప్రతి జీవంపైన 50 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి రసీదు పొందాలి. గేదెలు, ఆవులకు కొనుగోలు చేసిన దాన్లో 3-4 శాతం ప్రభుత్వ రుసుమే కింద చెల్లించి రసీదు తీసుకోవాలి. కానీ అవంతిపురం సంతలో ఎలాంటి రసీదులు లేకుండా ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు. కేవలం నామమాత్రంగా కొన్ని రసీదులు మాత్రమే అధికారికంగా నమోదు చేస్తున్నారు. ఒక్కరోజు సంత ఆదాయం లక్షల రూపాయలు ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వచ్చిన సొమ్మును అధికారులు వాటాల గా పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

చైర్మన్ లేకపోవడమే కారణమా

జిల్లాలోనే పేరు ఉన్న మిర్యాలగూడ సంతకు గత ఏడాదిన్నరగా చైర్మన్ లేకపోవడం వలన అధికారుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అడిగేవారు లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులతో వసూళ్లకు పాల్పడుతున్నారు. లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయం దోచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు కోరుతున్నారు.

హోటళ్ల పేరుతో వసూళ్లు..

మిర్యాలగూడ సంతకు వచ్చేవారికోసం ఎనిమిది భోజన హోటళ్లు నిర్వహిస్తున్నారు. నిర్వహించుకోవడానికి ఒక్కొక్క హోటల్ కు నెలకు(వారానికి రెండు రోజుల చొప్పున) 4000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సంతలో హోటల్ నిర్వహణకు టెండర్ ప్రక్రియ చేపట్టాలని కోరినప్పటి కూడా అధికారులు మాత్రం టెండర్ వేయకుండా వారికి నచ్చిన వారికి హోటల్ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్లు ఇస్తున్నారు. హోటల్ ఏర్పాటు చేసుకునే వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story