సూర్యాపేటలో జోరుగా కల్తీ మాల్.. అక్రమ సంపాదనకు ఆరాటం

by Anjali |
సూర్యాపేటలో జోరుగా కల్తీ మాల్.. అక్రమ సంపాదనకు ఆరాటం
X

దిశ , సూర్యాపేట: కాదేదీ కల్తీకి అనర్హం ఆన్న చందంగా జిల్లాలో అంతా కల్తీమయమే రాజ్యమేలుతోంది. ఉదయం లేచిన దగ్గరి నుంచి పాలతో ప్రారంభమయ్యే రోజు వారి జీవనంతో మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఉపయోగించే ఆహార పదార్థాలు, వాహనాల్లో నింపే పెట్రోల్, డీజిల్ వరకు అంత కల్తీ అవుతోంది. ఉప్పు,కారం, పసుపు,వంట నూనె, మసాలా పొడులు, పప్పు దినుసులు, అల్లం పేస్టు, చక్కెర, టీ పొడి,పెట్రోల్,డీజిల్, మందులు, ఆల్కహాలుతో పాటు చివరకు మంచినీళ్ళు కూడా కల్తీ చేస్తున్నారు . లాభార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం నిత్యకృత్యమైంది. వ్యాపారులు ధనార్జనే లక్ష్యంగా అడ్డగోలుగా, అక్రమంగా, అవినీతికి ఊతమిస్తూ అడ్డదారులకు అలవాటు పడ్డ ఆలోచన ఫలితమే ఈ కల్తీ రాజ్యం. వీటి ద్వారా వచ్చిన సొమ్ముతో రాజులుగా చెలామణి అవుతూ జల్సాలు చేస్తున్న అక్రమ వ్యాపారస్తులు సాధారణ ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం గుళ్ళ చేసేస్తున్నారు. ఫలితంగా ప్రజలను ఆసుపత్రుల పాలు చేసి చివరకు మట్టిపాలు చేసి కుటుంబాలను రోడ్డున పడేలా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కారకులవుతున్నారు.వీరు సంపాదించిన అక్రమ సొమ్ముతో ఆయా సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులకు అప్పుడప్పుడు చేతులు తడపడంతో జేబులు నింపుకున్న అధికారులు ఆ కల్తీల వ్యపారాలపై కన్నెత్తి చూడక పోవడం పరిపాటిగా మారింది.

విత్తనాలు.. ఆహార పదార్థాలు కల్తీయే

జిల్లాలో ఏ మూలన చూసినా కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. దీనికి నిలైలువెత్తు నిదర్శనం ఇటీవలే తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం,మద్ధిరాల మండలాల్లో ఈనెల 5న లభ్యమైన నకిలీ విత్తనాలుగా చెప్పవచ్చు. దీనిపై తిరుమలగిరి, అర్వపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో రూ .25 లక్షలు విలువ కలిగిన 52 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 300 లీటర్ల నిషేధిత గడ్డి మందులను పోలీసులు స్వాదీనం చేసుకొని నిందితులపై కేసులు నమోదు చేశారు. వీటివల్ల ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కల్తీ అవుతుందో తెలియక సామాన్యుడు చతికిల పడి పోతున్నాడు. అందువల్ల కల్తీ వ్యాపారం చేసే వారిని పట్టుకోవడం సామాన్యులకు అస్సలు సాధ్యం కావడం లేదు. కల్తీలపై ఉక్కు పాదం మోపాల్సిన అధికార యంత్రాంగం మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది.

అవకాశం దొరికినప్పుడు అక్రమార్కుల నుంచి అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ వ్యాపారాలకు పుట్టినిల్లుగా తయారైన ఈ సూర్యాపేటలో పెట్రోల్, డీజిల్, వంట నూనెలు, టీ పొడి, కారం, పసుపు పొడి, అల్లం పేస్టు లాంటి వ్యాపారులపై నిఘా పెట్టిన సూర్యాపేట పోలీసులు అక్రమార్కులను అరెస్టు చేసి కటకటాల పాలు చేసిన విషయం తెలిసిందే.పెట్రోల్, డీజిల్, కిరోసిన్, నకిలీ టీ పొడి, నకిలీ పత్తి విత్తనాలు అమ్మగా ఈ కేసు అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనాత్మకమైంది. ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లోనే డీజిల్,పెట్రోల్ లో కల్తీ కలుస్తోందని పలు బంకుల్లో వాహనదారులు గొడవకు దిగిన సందర్భాలు కోకొల్లలు. ముఖ్యంగా జిల్లాలోని ఖమ్మం క్రాస్ రోడ్,నల్లాల బావి, పాత బస్టాండ్,కొత్త బస్టాండ్, జనగాం క్రాస్ రోడ్,బైపాస్ రోడ్డు, బాలెంల బంకుల్లో కల్తీ పెట్రోల్ వస్తున్నట్లు గత 2 నెలల క్రితం కొంత మంది వాహనదారులు సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. అంతేకాక వంట నూనె సైతం జిల్లా కేంద్రంలోని నడి బొడ్డునే ఉండి పేరొందిన నూనె తయారీ షాపుల్లో రాత్రిళ్ళు కల్తీ తయారీ అవుతున్నట్లు సమాచారం. వంటలో ప్రధాన రుచికరమైన కారం కూడా కల్తీ గానే తయారవుతోందంటే నమ్మాల్సిందే. ఇవి వ్యవసాయ మార్కెట్ రోడ్డు, అన్నాధుల నగర్, ఖమ్మం రోడ్డు తదితర ప్రాంతాల్లో కారం వ్యాపార కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని కల్తీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు మూడేళ్ళ క్రితం నకిలీ టీ పొడితో కిరాణం షాపుల్లో దందా చేస్తున్న 8 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆ దందా చాపకింద నీరులా కొనసాగుతున్నట్లు సమాచారం.

గత కొన్నేళ్లుగా ఖమ్మం జిల్లా నుంచి సూర్యాపేట, కోదాడలకు కల్తీకారం ఎక్కువగా సరఫరా అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రంలో మిరపకాయలు పట్టే యజమానులు కల్తీ చేస్తున్నట్లు సమాచారం. నకిలీ చక్కెరను జీఎస్టీ లేకుండా అలంకార్ రోడ్, వ్యవసాయ మార్కెట్ రోడ్ ల టన్నుల కొద్దీ దిగుమతి చేసుకుంటున్నారు. ఈ అక్రమ వ్యాపారులపై ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు నిఘా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతారని ఆశిద్దాం. ఇదిలా ఉండగా జిల్లా ఏర్పాటు అయిన నాటి నుండి నేటి వరకు ఈ సంబంధిత శాఖ అధికారులు పనితీరు చూస్తుంటే ఇక్కడ ఆ అధికారులు సూర్యాపేట జిల్లాలో ఉన్నారా? అనే సందేహం ప్రజల్లో వెల్లువిరుస్తోంది. కల్తీ వ్యాపారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ మేక నాగేశ్వర్ రావు వెల్లడించారు. మానవ ఆహార పదార్థాల పేరుతో కల్తీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవు. అట్టి వ్యాపారులపై ఎవరికైనా తెలిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కి సమచారం అందించండి. వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. ముఖ్యంగా దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతు విత్తనాల్లో కల్తీ జరిగితే చట్టం దృష్టిలో తప్పించుకోలేరు. వాటిపై ఇప్పటికే శాఖ పరంగా నిఘా పెట్టామని ఆయన తెలిపారు.

Next Story