Andhra border : ఆంధ్ర సరిహద్దు వద్ద వజ్రాల కోసం వేట..

by Sumithra |
Andhra border : ఆంధ్ర సరిహద్దు వద్ద వజ్రాల కోసం వేట..
X

దిశ, చింతలపాలెం : కృష్ణపట్టే ఆంధ్ర ప్రాంతంలోని కోళ్లూరు వద్ద ఒక్క వజ్రం దొరికినా తమ కష్టాలు గట్టెక్కుతాయనే ఒక చిన్న ఆశ, తమ బతుకు చిత్రం పూర్తిగా మార్చి వేస్తుందనే నమ్మకం, మనిషిని ఎంత దూరమైన నడిపిస్తుంది. 13 వ శతాబ్దం నుండి కొల్లూరు గనులుగా ప్రసిద్ధి పొంది ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో వజ్రాల అన్వేషణకు ప్రసిద్ధి చెందిన కొల్లూరు వజ్రాల గుట్ట పై వజ్రాలు దొరుకుతాయి అన్న నెపంతో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తమ సొంత పనులను పక్కనపెట్టి అదృష్టాన్ని దక్కించుకోవాలని వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు. వివరాల్లోకెళితే చింతలపాలెం మండలం కృష్ణా పరివాహక ప్రాంతం, కృష్ణా నదికి పాత వెళ్లటూరుకు అవతల పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముంపు గ్రామాల్లో పులిచింతల, కోళ్లురు గ్రామాలు ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఈ ప్రాంతం ముంపునకు గురి అయింది.

కృష్ణా తీరంలో కోళ్లురు ప్రాంతం భౌగోళికంగా ప్రత్యేకమైనది. ఇక్కడ మట్టి కంకర రాళ్ల గుంతలతో ఈ ప్రాంతం ప్రత్యేకంగా కనిపిస్తుంది. కోహినూరు వజ్రం దొరికిన కొల్లూరు వజ్రపు గనులుగా ఈ ప్రాంతం ప్రసిద్ధి. గతంలో ఇక్కడ అనేక వజ్రాలు దొరికాయి, ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ఈ ప్రాంతం వజ్రాల అన్వేషకులకు మార్గం సుగమం చేసింది, ఒక్క వజ్రమైన దొరక్కపోదా, లక్షలు రాకపోవా అనే ఆశతో వజ్రాల అన్వేషకులు, జనం వజ్రాల కోసం గాలిస్తున్నారు. గుంపులు గుంపులుగా వచ్చి వజ్రాలను వెతుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాక తెలంగాణ నుంచి చింతలపాలెం, మేళ్లచెరువు తదితర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ఆటోలు, బైకులు, ట్రాలీల ద్వారా జనం ఇక్కడికి వస్తున్నారు. అక్కడి నుంచి మత్స్యకారుల బోటుల ద్వారా అవతలకు చెరి వజ్రాల అన్వేషణ ప్రారంభిస్తున్నారు. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అనే నమ్మకంతో రోజుకి 2 వేల నుండి 3 వేల మంది దాకా జనం ఇక్కడ వాటి కోసం వెతుకుతుంటారు. భూమికి అడుగు నుంచి రెండు అడుగుల దూరంలో గోతులు తవ్వి, అనుమానం వచ్చిన ప్రతీ రాయిని సేకరిస్తుంటారు. అనుకున్నట్టుగానే కొంతమంది ఆశలు నెరవేరుతున్నాయి. విలువైన వజ్రాలు వారికి దొరుకుతున్నాయి. ఇటీవల వరసగా మండలంలోని వారికి వారం రోజుల్లో నాలుగు నుంచి ఆరు నాణ్యమైన వజ్రాలు లభించాయని ప్రచారం ఊపందుకుంది. దీంతో వజ్రాల వేట మరింత ఊపందుకుంది.

జనం సందడి మొదలవడంతో అక్కడ హోటల్లు తెరిచి వ్యాపారం చేస్తున్నారంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. తాజాగా మరో మహిళ కు విలువైన వజ్రం దొరికింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. తమకు దొరికిన రాళ్ళను అక్కడే డైమండ్ టెస్టర్ ద్వారా చెక్ చేయించుకొని అది వజ్రమో కాదో తెలుసుకుంటున్నారు. దీంతో ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారుతుందన్న ఆశతో జనం వజ్రాలు వెదుకుతున్నారు. మరోవైపు దొరికిన వజ్రాలను కొనేందుకు వ్యాపారులు సైతం సమీప ప్రాంతాల్లో తిష్ట వేశారు. జనం పోటెత్తడంతో మత్స్యకారుల బోట్లు నడుపుతున్నారు. ఈ వజ్రాలు దొరికిన వారు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు వస్తాయి అనుమానంతో తమకు దొరికిన విషయాన్ని పంచుకోవడానికి ఇష్టపడడం లేదు. ఈ అదృష్టం ఎంతమందికి వరించునో అని పరిసర ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు.



Next Story