ఆ కళాశాలలను ఎట్లా నడిపిస్తుండ్రో.. అసెంబ్లీలో ఎమ్మెల్యే గాదరి కిషోర్

by Kalyani |   ( Updated:2023-02-12 14:50:58.0  )
ఆ కళాశాలలను ఎట్లా నడిపిస్తుండ్రో.. అసెంబ్లీలో ఎమ్మెల్యే గాదరి కిషోర్
X

దిశ, తుంగతుర్తి: రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలను దాదాపు 10 ఏళ్ల క్రితం అప్ గ్రేడ్ చేసినప్పటికీ పోస్టులను మాత్రం ఇంకా మంజూరు చేయలేదని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం తుంగతుర్తితో పాటు తాను చదువుకున్న సర్వేలు గురుకుల పాఠశాల, వివిధ ప్రాంతాల్లో విద్యావసరాలు, భవనాల అద్దె, తదితర అంశాలపై అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగించారు. 2014లో తుంగతుర్తితో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఉన్న మరో మూడు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలను కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశారని తెలిపారు. అనంతరం 2017లో కూడా మరికొన్నింటిని అప్ గ్రేడ్ చేశారన్నారు. అయితే 2017లో అప్ గ్రేడ్ అయిన కళాశాలలలో పోస్టులను మంజూరు చేయగా 2014లో చేసిన వాటికి మాత్రం నేటి వరకు కూడా పోస్టులను మంజూరు చేయలేదని అన్నారు.

ఆ కళాశాలలను ఎలా నడిపిస్తున్నారో.. వారికే తెలియాలని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఆ జీవోనే మర్చిపోయారని అన్నారు. ఇదిలా ఉంటే రెగ్యులర్ రెసిడెన్షియల్ సొసైటీలకు సొంత భవనాలు లేక, అద్దె భవనాలలో నడుస్తున్నందువల్ల రెంట్ ఫిక్స్ చేసిన ఫైళ్లను నిబంధనల ప్రకారం పంపిస్తే ఏడాది కాలంగా పెండింగ్ లోనే ఉన్నాయని అన్నారు. భవన యజమానులతో ఇబ్బందులు వస్తున్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ మహా యజ్ఞానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని సీరియస్ గా తీసుకొని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మాదిరిగానే అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నందువల్ల విద్యారంగాపరంగా రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గ కేంద్రాల్లో రెగ్యులర్ సొసైటీలను ఏర్పాటు చేయాలని చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు.

అత్యంత కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్న సర్వేలు గురుకులాన్ని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద గుర్తించడంతోపాటు 50 ఏళ్ల వేడుకలు నిర్వహించాలని కోరారు. ఇదే విషయాన్ని గత అసెంబ్లీలో కూడా చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గురుకులంలో బిల్డింగ్ పూర్తి కావస్తున్న సందర్భంలోనైనా వేడుకలను నిర్వహించాలని కోరారు. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలను పెంచాలని, రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సంబంధిత శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. అప్ గ్రేడ్ పొందిన కళాశాలలకు పోస్టుల మంజూరు, డైట్ చార్జీల పెంపు, తదితర అంశాలను పరిష్కరిస్తామని వివరించారు.

Advertisement

Next Story