కేసీఆర్ పీఠం కదిలించాలి.. మాజీ సీఎల్పీ నేత..

by Sumithra |
కేసీఆర్ పీఠం కదిలించాలి.. మాజీ సీఎల్పీ నేత..
X

దిశ, తిరుమలగిరి (సాగర్) : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సాగుతున్న గిరిజన చైతన్య యాత్రతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు గిరిజనేతరులు స్ఫూర్తి పొంది రాబోయే ఎలక్షన్లో కేసీఆర్ పీఠం కదిలించాలని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని బట్టువెంకన్న బావి తండాలో కొనసాగిన గిరిజన చైతన్య యాత్రలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కేసీఆర్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే ఉన్నాయని అన్నారు. దళిత సీఎం, రుణమాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిస్థితి ఏమైందని అన్నారు. మాటలు చెప్పి మూటలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాడని కేసీఆర్ పై ధ్వజమెత్తారు. మీ అందరు ఐక్యమత్యంతో ఉండి కేసీఆర్ కి గుణపాఠం చెప్పాలన్నారు. రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.

పేదలకు ఇంటి నిర్మాణం కొరకు ఐదు లక్షల అందిస్తామని తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయలకు తగ్గిస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో గిరిజనులకు అటవీ భూములు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణంతో పాటు మారుమూల తండాలకు విద్యుత్ సదుపాయం కల్పించామని అన్నారు. గుడిసెలుగా ఉన్న తండాలు నేడు పక్కా గృహాలతో ఉన్నాయంటే అది కాంగ్రెస్ చలువేనని తెలిపారు. గోడుమడక నుండి బట్టువెంకన్న భావితండాకు రోడ్డు మార్గం వేయించామని తెలిపారు. ఇన్ని సదుపాయాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు జై వీర్ రెడ్డి, పీసీసీ సభ్యులు కర్నాటి లింగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ధనావత్ భాస్కర్ నాయక్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌని రాజా రమేష్ యాదవ్, వల్లపు రెడ్డి, తుమ్మలపల్లి శేఖర్, శాగం పెద్దిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమావత్ కృష్ణా నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ కలసాని చంద్రశేఖర్, గడ్డం సాగర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ముని నాయక్, అనుముల అంజి, వేపటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story