ఖరారైన 'SRSP' నీటి విడుదల షెడ్యూల్

by Kalyani |   ( Updated:2022-12-08 11:29:36.0  )
ఖరారైన SRSP నీటి విడుదల షెడ్యూల్
X

దిశ, తుంగతుర్తి: ప్రస్తుత రబీ పంట సాగు కోసం శ్రీరాంసాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) జలాల విడుదల ఎప్పుడెప్పుడా ? అంటూ ఎదురుచూస్తున్న రైతాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సూర్యాపేట జిల్లాకు నీరు విడుదల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 24 నుంచి పంట చేతికొచ్చే వరకు (అంటే ఏడాది ఏప్రిల్ 15 వరకు) వారబందీ పద్ధతిలో (ఒక వారం విడుదల- మరో వారం నిలుపుదల) నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ లెక్కన మొత్తంగా జిల్లాకు 56రోజులపాటు (మూడు లక్షల 36 వేల క్యూసెక్కుల నీరు) 29.028 టీఎంసీల నీరు విడుదల చేయనున్నారు. గత ఏడాది రబీ సీజన్ కంటే ఈ రబీ సీజన్ లో నాలుగు రోజుల ముందుగానే నీరు విడుదల షెడ్యూల్ ఖరారు కావడం గమనార్హం. (అంటే గత ఏడాది డిసెంబర్ 28న నీరు విడుదల జరుగగా ఈ ఏడాది డిసెంబర్ 24న).

వారబందీ పద్ధతిలో..

ఈ నెల 24న ఉమ్మడి వరంగల్ జిల్లా కొడకండ్ల మండల పరిధిలోని బయన్న వాగు రిజర్వాయర్ గేట్లను అధికారులు లాంఛనంగా ఎత్తి సూర్యాపేట జిల్లా వైపు నీరు విడుదల చేయనున్నారు. ఈ మేరకు 25 లేదా 26న వెలిశాల వద్ద 69,70,71డిస్ట్రిబ్యూటర్ల ద్వారా శ్రీరామ్ సాగర్ నీళ్లు జిల్లాలోకి ప్రవేశించనున్నాయి. తొలుత తుంగతుర్తి తర్వాత సూర్యాపేట (ఈ రెండునియోజకవర్గాలలో మొత్తంగా మండలాలు), కోదాడ (కొన్ని మండలాలు మాత్రమే) నియోజకవర్గాలలోని పలు మండలాల చెరువులు, కుంటల్లోకి నీరు చేరనుంది. ప్రతిరోజు 5 వేల 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. 24 న విడుదలయ్యే జలాలు ఈ నెల 31 వరకు (అంటే వారం రోజులు) నిరాటంకంగా జిల్లా వైపు రానున్నాయి. అనంతరం మళ్లీ జనవరి 8 నుండి 15 వరకు, 23 నుండి 30 వరకు, ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి 14 వరకు తిరిగి 22 నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు నీటి విడుదల జరగనుంది. అలాగే 9 నుంచి 16 వరకు, 24 నుంచి 31 వరకు, ఏప్రిల్ 8 నుంచి 15 వరకు నీటి విడుదల చేయనున్నట్లు గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. ఈలోగా రబీ పంటల సాగు పూర్తి కాకుంటే మరో వారం పది రోజులు నీరు విడుదల పొడిగించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed