ఆ జిల్లాలో ఎక్సైజ్ శాఖకు కిక్కే కిక్కు

by srinivas |
ఆ జిల్లాలో ఎక్సైజ్ శాఖకు కిక్కే కిక్కు
X

దిశ నల్లగొండ బ్యూరో: మందుబాబులు... తెగ తాగారు. తాగి ఊగారు. ఎక్సైజ్‌ శాఖకు మాంచి కిక్కిచ్చారు. సందర్భం ఏదైనా సరే మందుబాబులకు కిక్కు ఉండాల్సిందే. అదే డిసెంబర్‌ 31 అయితే ఇంకా చెప్పక్క ర్లేదు. ఆరోజు ఎలాగైనా మందు తాగాల్సిందే..ప్రభుత్వం కూడా అర్ధరాత్రి వరకు విక్రయాలు చేయడంతో ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకు మద్యం షాపులు, బార్లు, బెల్టు షాపుల వద్ద సందడి కనిపించింది. న్యూఇయర్ వేళ మందుబాబులు మద్యం మత్తులో మునిగి తేలారు. తెగా తాగి ఊగారు. ఇట్స్‌ ఏ న్యూ ఇయర్‌ పార్టీ అంటూ చిందులేశారు. పెగ్గు పెగ్గు మీద పెగ్గు లాగేశారు. ఫలితంగా రెండు రోజుల్లోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో రూ.69.64కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మొత్తం రూ.297.28 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కేవలం రెండు రోజుల్లో జరిగిన రూ. 69.64 కోట్ల రూపాయలతో కలిపి ఎక్సైజ్ శాఖకు డిసెంబర్ నెలలో మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా కు రూ.366.92 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మద్యం ఏరులై పారింది.. సహజంగా ఏ చిన్న ఫంక్షన్ జరిగిన మద్యం లేకుండా జరిగిన దాఖలాలు లేవు.. ఇక కొత్త సంవత్సరం వచ్చుతుందంటే వయసుతో నిమిత్తం లేకుండా మందు తాగాల్సేందే. లేకపోతే ఆ వేడుకలకు జోష్ ఉండదు. ఇలాంటి పరిస్థితులలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డిసెంబర్ నెల తో పాటు చివరి రెండు రోజులు ఎక్కువ మొత్తంలో మద్యం విక్రయాలు జరిగినట్లు ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది.

30,31తేదీలలో రూ.69.64కోట్లు

డిసెంబర్ 30, 31వ తేదీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 69. 64 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నల్లగొండ జిల్లా ఏడు సర్కిల్ లో రెండు రోజుల్లో 29.59 కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా, సూర్యాపేట జిల్లాలోని 4 సర్కిల్ లలో 20.9 కోట్ల మద్యం అమ్మకాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 4 సర్కిల్ లలో 19.15 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

డిసెంబర్ 1 నుంచి 29వరకు అమ్మకాలు

డిసెంబర్ 1 వ తేదీ నుంచి 29 వరకు నల్లగొండ జిల్లాలో రూ. 137.69 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.85.45 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ. 74.14 కోట్ల అమ్మకాలు జరిగాయి. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మొత్తం రూ.297.28 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కేవలం రెండు రోజుల్లో జరిగిన రూ. 69.64 కోట్ల రూపాయలతో కలిపి ఎక్సైజ్ శాఖకు డిసెంబర్ నెలలో మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా కు రూ.366.92 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

ప్రధానంగా యువతే....

మద్యానికి ఎక్కువగా ఆకర్షితులవుతున్న వాళ్లంతా యువతే. 15 నుంచి 30 ఏళ్ల వరకు వయసు కలిగిన యువత మద్యం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నూతన సంవత్సర వేడుకల్లో యువత అత్యంత ఇష్టంగా పాల్గొంటుంటారు. ఆ వేడుకలలో ప్రధాన వస్తువుగా మద్యం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డ వాళ్లలో ఎక్కువగా యువతే ఉంటున్నారనేది బహిరంగ రహస్యమే.

Advertisement

Next Story