తహశీల్దార్ కార్యాలయంలో అవినీతిని అరికట్టాలి..

by Sumithra |
తహశీల్దార్ కార్యాలయంలో అవినీతిని అరికట్టాలి..
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలంటే సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నారాయణపురం ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డబ్బులు ఇస్తేనే సర్వేచేస్తున్న సర్వేయర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య మాట్లాడుతూ సంవత్సరకాలంగా తహశీల్దార్ కార్యాలయం రిపోర్టులు ఇవ్వకుండా ధరణి దరఖాస్తులను పెండింగ్ లో పెట్టిందని ఆరోపించారు. అదేవిధంగా డబ్బులు ఇచ్చిన వారి ఫైళ్లను క్లియర్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటును నిర్ధారించి దళారుల ద్వారా వ్యవస్థను కొనసాగిస్తున్నారని అన్నారు. రాచకొండలో గల గ్రామపంచాయతీ భూములను తిరిగి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపించారు.

తహశీల్దార్ కార్యాలయానికి వస్తే పేదలు ఎవరికీ న్యాయం జరగడం లేదని వెంటనే తహశీల్దార్ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏళ్లుగా ప్రభుత్వ భూములలో సాగు చేసుకుంటున్నా రైతులకు నూతన పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే వారికి నూతన పాస్ పుస్తకాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాచేస్తున్న వారి వద్దకు ఎమ్మార్వో కృష్ణ వచ్చి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని తమ దృష్టికి తీసుకువస్తే అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని సమాధానం ఇవ్వడంతో ధర్నాను విరమించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కురిమిద్ద శ్రీనివాస్, సీపీఐ పట్టణ కార్యదర్శి చిలువేరు అంజయ్య, పల్లె మల్లారెడ్డి, కలకొండ సంజీవ, కొప్పు సుధాకర్, భీమనగాని గాలయ్య, వీరమళ్ళ యాదయ్య, సురపల్లి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed