ప్రజాస్వామ్యం పరిణితి చెందాలి : కేసీఆర్

by Naresh |   ( Updated:2023-10-31 14:03:11.0  )
ప్రజాస్వామ్యం పరిణితి చెందాలి : కేసీఆర్
X

దిశ, మిర్యాలగూడ: ప్రజలు, ప్రజాశక్తి గెలిచే పరిణితిని ఓటర్లు ప్రదర్శించాలని... ఓటు వేసేప్పుడు వ్యక్తి, పార్టీ చరిత్ర, ప్రజాసంక్షేమం పట్ల వారి ఆలోచనలను గుర్తించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గెలుపు కోరుతూ మంగళవారం మిర్యాలగూడలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాల సూచి నివేదిక మేరకు తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, తాగు నీటి సరఫరాలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. సాగునీటి కల్పనలో సమగ్ర ప్రణాళికలు తయారు చేసి తెలంగాణని దేశానికే అన్నపూర్ణగా మారుస్తామని సీఎం ప్రకటించారు. 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ సవ్యంగా పాలన చేసి ఉంటే నీటి కోసం ఆందోళనలు జరిగేవి కావన్నారు.

రైతుల సంక్షేమం పట్టని కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ వ్యవసాయాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం జలాలను ఎడమ కాల్వకు అనుసంధానం చేసి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ని మించి పోయేలా ప్రణాళికలు తయారు చేసినట్లు పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు అధిగమించేందుకు గోదావరి జలాలను కాళేశ్వరం నుంచి ఉదయ సముద్రం వరకు అక్కడ నుంచి పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ కి తరలించి నియోజకవర్గంలో శాశ్వత సాగు నీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. యుగ యుగాలుగా అణచివేయబడుతున్న దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు తెచ్చామన్నారు. రైతుల పరిస్థితి మెరుగుపర్చేందుకు రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ మిషన్ భగీరథ ద్వారా ఆడ బిడ్డల నీటి గోస తీర్చినట్లు పేర్కొన్నారు. పదేండ్ల పాలనలో కులం, మతం, జాతి వివక్ష లేని సెక్యూలర్ పాలన సాగించినట్లు పేర్కొన్నారు. హిందూ, ముస్లింల సంక్షేమం అభివృద్ధి దిశగా వివక్షత లేని పాలన సాగిస్తున్నామని అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలన్నారు.


రైతులు, పేదలు, విధి వంచితుల కోసం రైతు బంధు సాయం, ఆసరా పింఛన్లను విడుతల వారీగా పెంచి రేషన్ కార్డు దారులందరికి సన్నబియ్యం అందించునున్నట్లు ప్రకటించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో....ప్రజల బాగు కోరుతూ మంచి పనులు చేసే నాయకులను గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు తనకు కుడి భుజం లాంటి వాడని నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్ప సొంత ప్రయోజనాలు ఆశించని భాస్కర్ రావు ని లక్ష ఓట్ల మెజారిటీ తో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed