సాగు రైతుకే సహాయం అందాలి

by Kalyani |
సాగు రైతుకే సహాయం అందాలి
X

దిశ,తుంగతుర్తి: సాగు చేస్తున్న రైతులకే రైతుబంధు లబ్ధి చేకూరడంతో పాటు ఈ పథకంలో కొన్ని నియమ నిబంధనలు,పరిమితులు విధించాలని, శనివారం తుంగతుర్తి మండల కేంద్రం రైతు సేవ సహకార సంఘం ఆవరణలో సంఘం చైర్మన్ గుడిపాటి సైదులు అధ్యక్షతన జరిగిన అభిప్రాయ సేకరణలో రైతులంతా ముక్తకంఠంతో అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ఇష్టానుసారంగా రైతు బంధు పథకం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా 5 నుంచి 10 ఎకరాల మధ్యనే రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా నిరుపయోగంగా ఉన్న భూములను పక్కనపెట్టి సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తింప చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని రైతాంగమంతా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అలాగే సాగు చేస్తున్న వారిలో హక్కుదారుడు లేదా కౌలుదారుల్లో ఎవరో ఒకరికి మాత్రమే రైతుబంధు అందాలని స్పష్టం చేశారు.ఇప్పటికి కూడా కొంతమంది రైతులకు పట్టాలు కాకపోవడంతో రైతుబంధుని అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వందల ఎకరాల భూములు ఉన్న భూస్వాములు ఒకవైపు కౌలు రైతుల నుండి కౌలు పొందుతూ మరోవైపు రైతుబంధు పొందుతున్నారని అన్నారు. చివరికి కౌలుదారులు మాత్రం కేవలం పంటపైనే ఆధారపడాల్సి వస్తుందని వివరించారు.

47 సొసైటీలలో వచ్చేనెల 4 వరకు అభిప్రాయ సేకరణలు

రైతు బంధు పథకంపై రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం శనివారం నుంచి (ఈనెల 29 నుంచి) ప్రారంభమైందని, జిల్లా కో-ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ జి. శ్రీనివాసులు “దిశ”కు తెలిపారు. మొత్తంగా జిల్లాలో ఉన్న 47 సొసైటీల ద్వారా జూలై నాలుగో తేదీ వరకు రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాలను నివేదిక ద్వారా అందజేస్తామని తెలిపారు. తొలి రోజు రైతుల నుంచి సేకరించిన అభిప్రాయ లన్నింటిని రికార్డ్ చేశామని తెలిపారు. నాలుగో తేదీ వరకు అభిప్రాయ సేకరణలన్ని పూర్తి చేసి ఆ నివేదిక జిల్లా అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టర్ అశోక్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జగ్గు నాయక్, వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ, ఆడిటర్ రామచంద్రయ్య, ఏఈఓలు మనోహర్, లక్ష్మీ ప్రసన్న,సృజన సొసైటీ కార్యదర్శి నందనం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed