సివిల్ సప్లయ్ శాఖ లో తోడుదొంగలు.. తీగ లాగితే కదులుతున్న డొంక

by samatah |
సివిల్ సప్లయ్ శాఖ లో తోడుదొంగలు.. తీగ లాగితే కదులుతున్న డొంక
X

దిశ, సూర్యాపేట ప్రతినిధి: పౌర సరఫరాల శాఖలో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతోంది. తీగ లాగితే కదులుతున్న డొంక కదులుతుంది. ఇటీవల 'దిశ' దినపత్రిక బ్లాక్ కింగ్ అనే శీర్షికన కథనం ప్రచురితం అయ్యింది. ఈ కథనంపై ఒక మిల్లర్ సివిల్ సప్లయ్ శాఖలోని ఓ రెగ్యులర్ ఉద్యోగికి ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..‘ నేను కొద్దిరోజుల క్రితం అధిక ధాన్యం సెంటర్ల ను నా మిల్లుకు ట్యాగింగ్ చేసినందుకు రూ.85 వేలు పంపిచాను..’ అనడంతో రెగ్యులర్ ఉద్యోగి షాక్ అయ్యాడు. దీంతో సదురూ ఉద్యోగిని సంప్రదించి తను రూ. 85 వేలు పంపిస్తే రూ. 35 వేలు నాకు లెక్క చూపావు. మిగతా రూ.50 వేలు ఎం అయ్యాయని ఇద్దరూ సంభాషించుకోవడం ఈ నోట, ఆ నోట పడి విషయం కాస్తా బయటకు పొక్కింది. జిల్లాలోని ఒక్క మిల్లుకే ధాన్యం సెంటర్ ని కేటాయించినందుకు 85,000 ఇస్తే సుమారు 70 మిల్లులకు పైగా ధాన్యం సెంటర్లను ట్యాగింగ్ ఇచ్చారు. ఇలా ఒక్కొక్క మిల్లు దగ్గర 85,000 రూపాయలు వసూల్ చేశారంటే అంటే వీళ్ళ అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మిల్లర్లు సివిల్ సప్లయ్ శాఖ లో ని ఉద్యోగులు డబ్బులు ఇచ్చిన మిల్లర్లకు అత్యధిక సెంటర్ల ను ట్యాంగింగ్ చేస్తూ రూ. లక్షలు దండుకుంటున్నారని బహిరంగ విమర్శిస్తున్నారు.

నాకు వచ్చింది రూ. 35 వేలే..

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించడానికి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు మేలు చేయడం కోసం ధాన్యం సెంటర్ల కు మిల్లర్లను ట్యాంగింగ్ చేసి, వెంట వెంటనే ధాన్యం ఎగుమతులు చేయాలని ఒక వైపు జిల్లా మంత్రి, కలెక్టర్,అదనపు కలెక్టర్ క్రిందిస్థాయి అధికారులను ఎప్పడికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మరో వైపు అవకాశం వచ్చిందని సివిల్ సప్లయ్ శాఖలోని ఇద్దరు ఉద్యోగులు మిల్లులకు ధాన్యం సెంటర్ల ను ట్యాంగింగ్ చేయాలంటే లంచాలు అడుగుతున్నారు. లంచం ఇచ్చిన మిల్లర్లకు ఎక్కువ ధాన్యం సెంటర్ల ను ట్యాంగింగ్ చేస్తున్నారు. ధాన్యం సెంటర్ల కు ట్యాంగింగ్ చేసి ఒక్కోక్క మిల్లర్ల నుంచి రూ. 50 వేల నుంచి రూ.80 వేలకు పైగా వసూళ్లు చేస్తున్నట్లు మిల్లర్లు బహిరంగానే చెబుతున్నారు. అయితే తనకు మాత్రం ఒక మిల్లరు కేవలం రూ. 35 వేలు మాత్రమే ఇచ్చాడని సివిల్ సప్లయ్ శాఖలోని ఓ రెగ్యులర్ ఉద్యోగి చెప్పడం విడ్డూరంగా ఉంది. లంచం ఇవ్వనిదే ఆశాఖలో పని జరగదని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. ఆ శాఖలోని ఆ ఇద్దరూ ఉద్యోగుల వల్ల తమకు ప్రతి సీజన్లో తలనొప్పిగా మారిందని వారు పేర్కొంటున్నారు.

అవినీతి సొమ్ముపై ఇద్దరూ అధికారుల రగడ..

ధాన్యం సెంటర్ల ను తమ మిల్లర్లకు ట్యాంగింగ్ చేయాలని కొంతమంది మిల్లర్లు సివిల్ సప్లయ్ శాఖ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఓ ఉద్యోగిని సంప్రదిస్తారు. అనంతరం ఆ ఉద్యోగి కార్యాలయం నుంచి బయటకు వచ్చి మిల్లర్లతో సెటిల్మెంట్ చేస్తాడు. ఆ తర్వాత మిల్లర్ల ను ఆ శాఖలోని మరో ఉద్యోగి ఛాంబర్ కు తీసుకుపోయి పని అయ్యింది. మీరు మాట్లాడండి అంటూ ఆ ఉద్యోగి ఆ ఛాంబర్ నుంచి బయటకు వస్తాడు. బయట ఉన్న సిబ్బందికి ఛాంబర్లో మాట్లాడుతున్న విషయాలు బయటకు వినపించకుండా ఛాంబర్ డోర్ గడి వేసి ఛాంబర్ లోనే అంతా సెటిల్మెంట్ చేసుకుంటారు. ఈ వ్యవహారం అంతా జరిగిన కొద్దిరోజులకే సెటిల్మెంట్ సమయంలో మాట్లాడిన నగదు వారి చేతికి అందిన డబ్బుల లెక్కలు తేడాలు రావడంతో ప్రస్తుతం చిన్న స్థాయి రెగ్యులర్ ఉద్యోగి,ఒక ఉన్నతాధికారి అవినీతి సొమ్ముపై రగడ పడుతున్నట్లు కార్యాలయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

అభాసులపాలు అవుతున్న సివిల్ సప్లయ్ శాఖ

సివిల్ సప్లయ్ శాఖ పనితీరు అవినీతిమయంగా మారడంతో జిల్లా కలెక్టరేట్లో ఆ శాఖ ఇతర శాఖల ముందు అభాసులపాలు అవుతుంది. ఆ శాఖలో అవినీతి జలగలు ఉన్నాయని వార్త కథనాలు రావడంతో కలెక్టరేట్లోని అన్నిశాఖల అధికారులు సివిల్ సప్లయ్ శాఖ అవినీతిపై చర్చించుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సివిల్ సప్లయ్ శాఖలో ఎం జరుగుతుంది అనే దానిపైన ఇతర శాఖల ఉద్యోగులు చర్చించుకోవడం గమనార్హం. రెండు సీజన్లలో సివిల్ సప్లయ్ శాఖలోని ఆ ఇద్దరూ ఉద్యోగులు రూ. లక్షలలో అవినీతికి పాల్పడినట్లు కలెక్టరేట్లోని ఇతర శాఖలోని ఉద్యోగులు సైతం పేర్కోనడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం ఇలానే కొనసాగితే మిల్లర్లే కాకుండా రైతులు కూడా నష్టపోతారని వాపోతున్నారు,ఇప్పటికైనా ఉన్నతధికారులు స్పందించి లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్న ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకొని రైస్ మిల్లర్లకు, రైతులకు విముక్తి కలిగించాలని కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed