మునుగోడు కాంగ్రెస్‌లో పదవుల రచ్చ

by Mahesh |
మునుగోడు కాంగ్రెస్‌లో పదవుల రచ్చ
X

దిశ, గట్టుప్పల్: మునుగోడు కాంగ్రెస్‌లో ఇప్పటివరకు వర్గ పోరే అనుకుంటే కమిటీల ఏర్పాటు, పదవుల కేటాయింపుల్లోనూ వివాదం చోటు చేసుకుంది.మండలాల్లో సీనియర్లను, ఇతర నాయకులను కలుపుకొని పోయి సమిష్టి నిర్ణయంగా పదవులు ఇవ్వడం కాకుండా ఓ నాయకుడు తన వర్గం వారికి మాత్రమే పదవులు కేటాయిస్తున్నారంటూ కొందరు సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు మండిపడుతున్నారు.

ఈ విషయమై రెండు రోజుల క్రితం పాల్వాయి స్రవంతి రెడ్డి, పున్న కైలాస్ నేత, ఇతర నియోజకవర్గ ముఖ్య నాయకులు హైదరాబాదుకు వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాక్రే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ బోసురాజు ను కలిసి వారికి ఫిర్యాదు చేశారు. కొందరు నాయకులు నిరసన కూడా వ్యక్తం చేశారు. గత ఉప ఎన్నికల్లో ఇతర పార్టీలు డబ్బు ఎర చెప్పినప్పటికీ పార్టీకి కట్టుబడి పలువురు పని చేశారని అలాంటి వారికి పదవులు దక్కాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇప్పుడు పదవులు ఇచ్చిన వారితో పార్టీ బలోపేతం కాదు కదా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వివరించారు. పిసిసి ఆమోదం లేకుండా ఏకపక్షంగా పదవులు కేటాయించడంపై నిలదీశారు. ఇందుకు ఆ ముఖ్య నాయకులు కూడా స్పందిస్తూ పదవుల కేటాయింపు, కమిటీలు ఏర్పాటు పైన అందరిని కలుపుకొని వెళ్లేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అని చండూరు కు చెందిన ముఖ్య నాయకులు తెలిపారు.

కమిటీల ఏర్పాటు ఎంత మేరకు సమిష్టిగా జరుగుతుందో పార్టీ బలోపేతానికి ఎంతవరకు దోహదం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. పదవులు దక్కని వారు అసంతృప్తి చెందుతే మాత్రం పార్టీకి నష్టం వాటిలే అవకాశం ఉంది. ఈ క్రమంలో అందరిని కలుపుకుపోయేందుకే పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Next Story