నియోజకవర్గం అభివృద్ధి పై చర్చకు సిద్ధమా ?

by Sridhar Babu |
నియోజకవర్గం అభివృద్ధి పై చర్చకు సిద్ధమా ?
X

దిశ,రామన్నపేట : నకిరేకల్ నియోజిక వర్గంలో గత పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ధిపై ప్రతిపక్ష నాయకులు చర్చకు సిద్ధమా ? అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సవాల్ విసిరారు. గురువారం స్థానిక జేపీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాదగిరిగుట్ట దర్శనానికి వస్తున్న సందర్భంగా వలిగొండ మండలంలోని మూసీ ప్రక్షాళనలో పాల్గొని, రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారని తెలిపారు. మూసీ పక్షాళనకు మండలం నుంచి 15 వేల మంది రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మద్దతు పలుకుతామని తెలిపారు. మూసీ అభివృద్ధిపై మీరు ప్రభుత్వానికి మంచి సూచనలు చేయాలి కానీ, అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వమే వడ్ల మార్కెట్లు ఆలస్యంగా ప్రారంభించిందని, తమ ప్రభుత్వమే దసరా తరువాతి మొదటి వారంలోనే ప్రారంభించిందన్నారు. ప్రతి మార్కెట్లో ఏ సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వ ద్వారా బీఆర్ఎస్ ఎందుకు నీళ్లు తెప్పించలేదని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం తమ సొంత నిధులతో ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువల ద్వారా చెరువులు, కుంటలను నీళ్లతో నింపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. నల్లగొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులు జిల్లా మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసి పనులు తొందరలో పూర్తి చేయడానికి కృషిచేస్తున్నారని తెలిపారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాని సర్వనాశనం చేసింది మీ ప్రభుత్వమేనని అన్నారు. ఎలక్షన్ల ముందు ఓట్ల కోసమే బ్రాహ్మణ వెల్లెంలకు ఫొటోల కోసం మోటార్ ద్వారా ఒక్కరోజే నీళ్లు తెప్పించి రైతులను మోసం చేశారని అన్నారు. అయిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, గంగుల రాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, బత్తుల కృష్ణ, పూస బాలకిషన్, మేడి రవిచంద్ర, గాదె శోభారాణి, మడూరి జ్యోతి పాల్గొన్నారు.

Advertisement

Next Story