Biden : అమెరికాలో అధికార మార్పిడిపై జో బైడెన్ కీలక వ్యాఖ్యలు

by Hajipasha |
Biden : అమెరికాలో అధికార మార్పిడిపై జో బైడెన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్(Trump) విజయం తర్వాత తొలిసారిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Biden) స్పందించారు. వచ్చే ఏడాది జనవరి 20న శాంతియుత వాతావరణంలో అధికార మార్పిడికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని గురువారం ఆయన వెల్లడించారు. సాఫీగా అధికార బదలాయింపు కోసం ట్రంప్ టీమ్‌తో కలిసి పనిచేయాలని వైట్ హౌస్‌లోని తన అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశానని బైడెన్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమతాన్ని మించిన అంశం మరొకటి ఉండదన్నారు.

బుధవారం రోజే తాను ట్రంప్‌తో ఫోనులో మాట్లాడి.. ఎన్నికల్లో గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ట్రంప్‌నకు గట్టి పోటీ ఇచ్చిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌తోనూ తాను ఫోన్‌లో సంభాషించినట్లు చెప్పారు. హ్యారిస్ తన పోరాటాన్ని కొనసాగిస్తారని బైడెన్ స్పష్టం చేశారు. అసాధారణ పరిస్థితుల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా తెరపైకి వచ్చి.. చరిత్రాత్మకమైన ప్రచారానికి కమల నాయకత్వం వహించారని ప్రశంసించారు. ఈమేరకు ఎక్స్‌ వేదికగా ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఒక పోస్ట్‌ చేశారు.

Advertisement

Next Story